వృత్తిపరమైన బాధ్యతల్లో నిరంతరం నిమగ్నమై ఉండే జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని, శారీరక దృఢత్వం ఉంటేనే సమర్థవంతంగా వార్తల సేకరణ సాధ్యమవుతుందని ఎన్.యు.జె(ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్ తెలిపారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లిమ్రా ఫంక్షన్ హాల్‌లో శ్రీ లక్ష్మీ హాస్పిటల్ ఆరవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ ముఖ్యఅతిథిగా పాల్గొంటూ సమాజ సమస్యలపై గళం విప్పే జర్నలిస్టులు, తమ సొంత ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడం సరికాదని హితవు పలికారు.
పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రవణ్ కుమార్ జర్నలిస్టుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని రాజేందర్ నాథ్ కొనియాడారు. కేవలం పరీక్షలు చేయడమే కాకుండా, ఉచితంగా మందులు అందజేస్తూ జర్నలిస్టుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచడం హర్షనీయమని చెప్పారు. అలాగే వేసవి కాలంలో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉన్నందున రిపోర్టింగ్ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
జర్నలిస్టుల చిరకాల స్వప్నమైన ఇళ్ల స్థలాల సాధన కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పండ్లరాజు హామీ ఇచ్చారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ సహకారంతో త్వరలోనే అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు, ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం అందేలా చూస్తామని తెలిపారు. జర్నలిస్టు సంఘాలన్నీ సమిష్టిగా ముందుకు వచ్చి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
హెల్త్ క్యాంప్‌లో జర్నలిస్టులకు వివిధ రకాల రక్త పరీక్షలు, ఈసీజీ, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేజ్ల్, ఐజేయు జిల్లా అధ్యక్షులు రజనీకాంత్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు పి. శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టులు జావిద్ అలీ, అరిమిశెట్టి కృష్ణతో పాటు కాంగ్రెస్ నాయకులు అశోక్ రెడ్డి, సత్యం, కన్నయ్య, గంగాధర్, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

More Stories
దక్షిణ భారత్ ను, మహిళలను వంచించిన కాంగ్రెస్, ఇండీ కూటమి
ఆటిజం పిల్లలలో ప్రారంభ దశలో జోక్యం అత్యంత అర్ధవంతం
ఉప్పల్ మెట్రోస్టేషన్లో బాంబు బెదిరింపు