ఎవరు దేశభక్తులో.. ఎవరు అవినీతిపరులో బయటపడింది 

ఎవరు దేశభక్తులో.. ఎవరు అవినీతిపరులో బయటపడింది 

ఇప్పుడు ఎవరు దేశభక్తులో.. ఎవరు అవినీతిపరులో బయటపడిందని  మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో వీరి కథలు మరింతగా బహిర్గతమవుతాయని స్పష్టం చేశారు.

 గతంలో ఈ ప్రభుత్వం అవినీతిని ప్రశ్నించినందుకు తనపై దాడులకు పాల్పడ్డారని, బెదిరించారని, తనపై ఎన్నో విమర్శలు చేశారని కంగనా రనౌత్‌ గుర్తు చేశారు. అయితే, ముంబై పట్ల తన విధేయతను ప్రశ్నించినప్పుడు తాను నిశ్శబ్దంగా రోధించానని పేర్కొన్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా తన ఇంటిని కూల్చివేసిన సమయంలో పలు పార్టీల నాయకులు పండుగ చేసుకున్నారని తెలిపారు. అయితే  కోర్టుల్లో దావాలు వేస్తూ తాను తన ఆస్తిని కాపాడుకోగలిగాను అని కంగనా రనౌత్‌ చెప్పారు.

 “నేను నిజమైన దేశభక్తురాలినని, వారిలా అవినీతిపరురాలిని మాత్రం కాదు” అంటూ ఆమె స్పష్టం చేశారు. సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం సంభవించినప్పటి నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం-కంగనా రనౌత్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం కొనసాగుతున్నది. 

అనుమతి లేకుండా ఇళ్లు నిర్మించారన్న ఆరోపణలపై బృహణ్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు కంగనా ఇంటిని కూల్చివేశారు. దీంతో వైరం మరింత ముదిరింది.