హోంమంత్రి అనిల్‌పై ఆరోపణలు తీవ్రమైనవి

మ‌హారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై పోలీస్ మాజీ క‌మిష‌న‌ర్ పరంబీర్‌ సింగ్‌ చేసిన ఆరోప‌ణ‌లు తీవ్రమైనవని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తెలిపారు. ఈ ఆరోపణలపై దర్యాప్తునకు, హోంమంత్రిపై చర్యలకు నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు ఉన్నదని చెప్పారు. 

ఈ విషయంలో మాజీ ఐపీఎస్ అధికారి జూలియో రిబీరో సహకారం తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? అని విలేకర్లు అడిగినపుడు శరద్ పవార్‌ స్పందిస్తూ, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయో, లేదో తనకు తెలియదని చెప్పారు. 

అయితే ప్రభుత్వంపై ఈ ఆరోపణల ప్రభావం ఏమీ ఉండదని చెప్పగలనని తెలిపారు. అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ఈ సమయంలో అవినీతి ఆరోపణలు ఎందుకు వచ్చాయో చూడాల్సి ఉందని పేర్కొన్నారు. ముఖేష్‌ అంబానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్‌ అధికారి సచిన్‌ వాజేను నెలకు వంద కోట్లు వసూలు చేయాలని హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ డిమాండ్‌ చేసినట్లు ముంబై పోలీస్ మాజీ క‌మిష‌న‌ర్ పరంబీర్‌ సింగ్‌ శనివారం ఆరోపించారు. 

ఎన్సీపీకి చెందిన హోంమంత్రిపై అవినీతి ఆరోపణలు రావడంతో శ‌ర‌ద్ ప‌వార్ స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీ మంత్రులు, సీనియ‌ర్ నేత‌ల‌ను ఢిల్లీకి పిలిచారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ ప‌వార్‌, మంత్రి జ‌యంత్ పాటిల్ ఆదివారం ఢిల్లీ వెళ్లి ప‌వార్‌ను క‌ల‌వ‌నున్నారు. శివ‌సేన నేత సంజ‌య్ రౌత్ కూడా ఆయనతో భేటీ అవుతారని తెలుస్తున్నది.

కాగా, మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వివరించాలని కోరారు.

 మహారాష్ట్రలో కోవిడ్-19ను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. అవినీతి, నేరాలు కూడా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. ముంబైలోనూ, మహారాష్ట్రలోనూ అవినీతి ఎంత తీవ్రంగా ఉందో బయటపడుతోందని పేర్కొన్నారు.