మహారాష్ట్ర నుంచి వచ్చే బస్సులపై ఎంపీ నిషేధం

కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం శనివారం నుంచి మహారాష్ట్రకు బస్సులు నిషేధించింది. ముఖ్యమంత్రి  శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు నిషేధం విధించారు. 

పొరుగు రాష్ట్రం నుంచి వచ్చే ప్రయాణికులను వారం రోజుల పాటు నిర్బంధంలో ఉంచాలని ఇప్పటికే ప్రభుత్వం మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న జిల్లా యంత్రాంగానికి సూచించింది. వైరస్‌ వ్యాప్తి ప్రభావితమైన జిల్లాల్లో గ్వాలియర్‌, జబల్‌పూర్‌, ఉజ్జయిని, సాగర్‌, బేతుల్‌, బుర్హాన్‌పూర్‌, ఖార్గోన్‌, రత్లం, చింద్వారా జిల్లాల్లో మార్కెట్లు, వ్యాపార సంస్థలపై ఆంక్షలు విధించారు. 

భారీ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఇండోర్‌, భోపాల్‌, జబల్‌పూర్‌లో ఆదివారం మధ్యప్రదేశ్‌లో హోంశాఖ లాక్‌డౌన్‌ విధించింది. దీంతో ఈ మూడు నగరాల్లో అన్ని పాఠశాలలు, కళాశాలలను ఈ నెల 31వ వరకు మూసివేయనున్నారు. 

శనివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. అత్యవసర సేవలను కర్ఫ్యూ నుంచి మినహాయించారు. గత 24 గంటల్లో మధ్యప్రదేశ్‌లో 1,140 కొత్త కొవిడ్‌ కేసులు నమోదవగా.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,73,097కి పెరిగింది.