రైళ్లలో సిగరెట్ తాగితే జైలు తప్పదు

రైళ్లలో సిగరెట్లు, బీడీలు తాగితే ఇకపై జరిమానాలొక్కటే కాదు.. ఏకంగా కటకటాలపాలు కావాల్సి వస్తుంది. ఇంత వరకు జరిమానాలకే పరిమితమైన రైల్వే శాఖ డెహ్రాడూన్ అగ్ని ప్రమాదం ఘటన తర్వాత ధూమపానంపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. 
 
సిగరెట్ తాగకూడదన్న నిబంధన ఎవరైనా ఉల్లంఘించాలన్న ఆలోచనే రాకుండా చేయాలని నిర్ణయించింది. ఇటీవల న్యూఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్ ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణం ఓ ప్రయాణికుడు రైలులో సిగరెట్ తాగి, టాయిలెట్లో వేయడంతో టిష్యూ పేపర్లకు అంటుకుని అగ్నిప్రమాదానికి దారి తీసినట్లు గుర్తించారు. 
 
ప్రమాద ఘటనపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందించి రైళ్లలో ప్రమాదాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. చెప్పినట్లే రైల్వేశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి ప్రమాదానికి కారణాలను నిగ్గుతేల్చాలని ఆదేశించారు. 
 
డెహ్రాడూన్-న్యూఢిల్లీ ఎక్స్ ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదానికి కారణం సిగరెట్లను టాయిలెట్ బాక్సులో వేయగా, అందులో ఉన్న టిష్యూ పేపర్లకు అంటుకున్నట్లు తేలిందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన వీటిని మళ్లీ జరగకుండా ఏం చేయాలని చర్చించి, ఇంత వరకు ఉన్న చట్టాలు..  శిక్షలను సమీక్షించారు. 
 
ఇప్పటి వరకు ఉన్న చట్టాల ప్రకారం రైల్వే చట్టంలోని సెక్షన్ -167 ప్రకారం రైలు కంపార్టుమెంట్లో సిగరెట్ లేదా బీడీ తాగితే రూ.100 జరిమానా కట్టించేవారు. నామమాత్రంగా ఉన్న ఈ శిక్ష వల్ల మార్పు రాదని గుర్తించి జరిమానాను భారీగా పెంచాలని నిర్ణయించారు. అంతే  కాకుండా, జైలుకు పంపించేలా చట్టంలో సవరణలు తీసుకురావాలని ప్రతిపాదించారు. త్వరలోనే కఠిన నిర్ణయాల అమలుకు శ్రీకారం చుట్టేదిశగా చర్యలు చేపట్టారు.