ఇంగ్లండ్ పై భారత్ ఘన విజయం.. టీ20 సిరీస్ కైవసం

ఇంగ్లండ్ పై భారత్ ఘన విజయం.. టీ20 సిరీస్ కైవసం
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో ఆతిథ్య టీమిండియా 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ 32 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.
భారీ లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో బంతికే జాసన్ రాయ్‌ను భువనేశ్వర్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. అప్పటికీ ఇంగ్లండ్ ఇంకా ఖాతానే తెరవలేదు. అయితే తర్వాత వచ్చిన డేవిడ్ మలాన్‌తో కలిసి మరో ఓపెనర్ జోస్ బట్లర్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ జట్టును లక్షం దిశగా నడిపించారు. 
 
బట్లర్ తన మార్క్ షాట్లతో అలరించాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన బట్లర్ 34 బంతుల్లో 4 సిక్స్‌లు, మరో రెండు ఫోర్లతో 52 పరుగులు చేసి భువనేశ్వర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇదే క్రమంలో రెండో వికెట్‌కు 130 పరుగులు జోడించాడు. మరోవైపు ధాటిగా ఆడిన మలాన్ 46 బంతుల్లో రెండు సిక్స్‌లు, మరో 9 ఫోర్లతో 68 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత భారత బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీస్తూ భారత్‌కు విజయం సాధించి పెట్టారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి శుభారంభం అందించారు. రాహుల్‌కు బదులు ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లి ఓపెనర్‌గా వచ్చాడు. ఇక మరో ఓపెనర్ రోహిత్ ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. 

 
తన మార్క్ షాట్లతో స్కోరును పరిగెత్తించాడు. కోహ్లి సమన్వయంతో బ్యాటింగ్ చేయగా రోహిత్ చెలరేగి పోయాడు. ఈ జోడీని విడగొట్టేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోవడంతో ప్రత్యర్థి బౌలర్లు విలవిల్లాడారు. 
 
రోహిత్‌ను ఎలా కట్టడి చేయాలో వారికి అంతుబట్టకుండా పోయింది. వరుస ఫోర్లు, సిక్సర్లతో రోహిత్ కనువిందు చేశాడు. అతన్ని కట్టడి చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దూకుడుగా ఆడిన రోహిత్ 34 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు, మరో 4 బౌండరీలతో 64 పరుగులు చేశాడు. 
 
ఇదే క్రమంలో కోహ్లితో కలిసి తొలి వికెట్‌కు 9 ఓవర్లలోనే 94 పరుగులు జోడించాడు. తర్వాత వచ్చిన యువ సంచలనం సూర్యకుమార్ యాదవ్ కూడా దూకుడుగా ఆడాడు. అతనికి కోహ్లి అండగా నిలిచాడు. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన సూర్య స్కోరును పరిగెత్తించాడు. అతన్ని ఎలా నిలువరించాలో ఇంగ్లండ్ బౌలర్లకు అంతుబట్టకుండా పోయింది. విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించిన సూర్య 17 బంతుల్లోనే రెండు సిక్సర్లు, మరో మూడు ఫోర్లతో 32 పరుగులు చేసి ఔటయ్యాడు.

మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లి తన ఫామ్‌ను కొనసాగిస్తూ మరోసారి అజేయ అర్ధ సెంచరీని సాధించాడు. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న కోహ్లి తన ఖాతాలో మరో హాఫ్ సెంచరీని జత చేసుకున్నాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన కోహ్లి చివరి ఓవర్లలో చెలరేగి పోయాడు. 

 
హార్దిక్ పాండ్య కూడా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ స్కోరు 200 పరుగులు దాటింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 52 బంతుల్లోనే రెండు సిక్సర్లు, మరో ఏడు ఫోర్లతో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  హార్దిక్ 17 బంతుల్లోనే రెండు సిక్స్‌లు, మరో 4 ఫోర్లతో 39 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. దీంతో భారత్ స్కోరు 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 224 పరుగులకు చేరింది. ఇక ఇంగ్లండ్‌పై టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.