విద్య, ఉద్యోగాల్లో ఇంకెన్ని తరాలపాటు రిజర్వేషన్లు కొనసాగిస్తారని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్న పరిమితిని తొలగిస్తే, దాని ఫలితంగా అసమానతలు తలెత్తవచ్చని ఆందోళన వ్యక్తంచేసింది.
మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించటం, తద్వారా ఆ రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటడానికి సంబంధించిన కేసులో విచారణను సుప్రీంకోర్టు శుక్రవారం కొనసాగించింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎదుట మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
మారిన పరిస్థితుల నేపథ్యంలో మండల్ తీర్పును (మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్న దానిపై) సమీక్షించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. రిజర్వేషన్ల కోటా విషయాన్ని కోర్టులు రాష్ట్రాలకే వదిలివేయాలని సూచించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం కూడా 50 శాతం పరిమితిని ఉల్లంఘించిందని పేర్కొన్నారు.
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘మీరు చెబుతున్నట్టు రిజర్వేషన్లపై పరిమితిని (50 శాతాన్ని) తొలగిస్తే, అసలు ఏ పరిమితీ లేకుంటే.. అప్పుడు సమానత్వ భావన అనేది ఎలా ఉంటుంది? తర్వాత తలెత్తే అసమానతల మాటేమిటి? దీనిపై మీ అభిప్రాయాలు ఏమిటి? ఎన్ని తరాలపాటు రిజర్వేషన్లను కొనసాగిస్తారు?’ అని కోర్టు ప్రశ్నించింది.
దీనిపై రోహత్గీ స్పందిస్తూ.. మండల్ తీర్పును సమీక్షించేందుకు చాలా కారణాలు ఉన్నాయని చెప్పారు. 1931 జనాభా లెక్కల ఆధారంగా ఆ తీర్పు ప్రకటించారని, ఇప్పుడు జనాభా 130 కోట్లకు చేరిందని గుర్తు చేశారు. దీనిపై ధర్మాసనం మళ్లీ స్పందిస్తూ ‘స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు దాటిపోయింది. ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. అయినా.. ఏ అభివృద్ధీ సాగలేదని, ఏ బీసీ కులమూ అభివృద్ధి చెందలేదని అంటే మేం అంగీకరించాలా? అని ప్రశ్నించింది.
`వెనుకబాటుతనం నుంచి బయటకువచ్చిన వారిని రిజర్వేషన్ కోటా నుంచి తొలగించడమే మండల్ తీర్పు సమీక్ష ముఖ్య ఉద్దేశం’ అని విస్పష్టంగా ప్రకటించింది. దీనిపై రోహత్గీ వాదనలు కొనసాగిస్తూ ‘అవును, మనం అభివృద్ధిలో ముందడుగు వేశాం. అయితే దీనర్థం వెనుకబాటుతనంలో ఉన్న బీసీల సంఖ్య తగ్గిందని కాదు. మన దేశంలో ఇప్పటికీ ఆకలి చావులు సంభవిస్తున్నాయి’ అని పేర్కొన్నారు.
`ఇందిరా సహానీ (మండల్ తీర్పు) పూర్తిగా తప్పు అని నేను అనడం లేదు. నేను చెప్తున్నదేంటంటే.. 30 ఏండ్లు గడచిపోయాయి. చట్టం మారింది. జనాభా పెరిగింది. బీసీల సంఖ్య కూడా పెరిగి ఉండొచ్చు’ అని రోహత్గీ పేర్కొన్నారు. కాబట్టి రిజర్వేషన్ల పరిమితిని తొలగించే అంశాన్ని పరిశీలించాల్సిందేనని కోరారు. ఈ అంశంపై సోమవారం కూడా విచారణ కొనసాగిస్తామని ధర్మాసనం పేర్కొన్నది.
More Stories
ర్యాగింగ్పై కఠిన చర్యలు చేపట్టండి
క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఐఐటీ ఢిల్లీ, ఐఐఎస్సీ బెంగళూరు
ఉచిత రేషన్ కార్డుల జారీపై`సుప్రీం’ అభ్యంతరం