పురపాలకంలలో కొలువు తీరిన కొత్త పాలకవర్గాలు 

పురపాలకంలలో కొలువు తీరిన కొత్త పాలకవర్గాలు 
ఆంధ్ర ప్రదేశ్ లో  ఎన్నికల ఫలితాలు వెలువడిన 85 పట్టణ స్థానిక సంస్థల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి.   11 కార్పొరేషన్లు, 57 పురపాలక సంఘాలు, 17 నగర పంచాయతీల్లో గురువారం మేయర్లు/డిప్యూటీ మేయర్లు, చైర్‌పర్సన్లు/వైస్‌చైర్‌పర్సన్లు ఎన్నికయ్యారు. ఒక్క అనంతపూర్ జిల్లా తాడిపత్రిలో మినహా అన్ని చోట్ల అధికార పక్షం వైసీపీకి చెందిన వారే ఎన్నికయ్యారు.
 పశ్చిమగోదావరి జిల్లాలోని ఏకైక కార్పొరేషన్‌ ఏలూరులో  ఎన్నికలు జరిగినా హైకోర్టు నిర్దేశం మేరకు ఓట్ల లెక్కింపు జరగలేదు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో కౌంటింగ్‌ జరిగినా.. న్యాయస్థానం ఉత్తర్వుల  మేరకు ఫలితం ప్రకటించలేదు. 57 పురపాలికల్లో రెండు (కడప జిల్లా మైదుకూరు, అనంతపురం జిల్లా తాడిపత్రి) తప్ప.. మిగిలినవన్నీ వైసీపీ కైవసం చేసుకుంది.
టిడిపి ఆధిక్యత సాధించినా చైర్మన్‌ ఎన్నికల్లో మైదుకూరు కూడా పాలక పక్షం ఖాతాలో పడింది. జేసీ సోదరుల రాజకీయ చాతుర్యంతో తాడిపత్రి మాత్రం టీడీపీకే దక్కింది. ఇంకోవైపు.. నగర పాలక సంస్థల్లో మహిళలకే వైసీపీ పెద్దపీట వేసింది. 11 కార్పొరేషన్లలో ఏడు చోట్ల వారే మేయర్లుగా ఎన్నిక కావడం విశేషం. 56 మున్సిపాలిటీలు, 17 నగర పంచాయతీల చైర్‌పర్సన్లుగా మహిళలకే అధికార పక్షం పెద్దపీట వేసింది.
కృష్ణా జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం నగర పాలక సంస్థలకు, రెండు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల చైర్‌పర్సన్లుగా వారికే అవకాశం లభించింది. చాలాచోట్ల డిప్యూటీ మేయర్లు/వైస్‌చైర్‌పర్సన్‌ పదవులు కూడా వారినే వరించాయి. మేయర్‌/చైర్‌పర్సన్ల ఎన్నికలు పూర్తికావడంతో 13 నెలలు కొనసాగిన పురపాలక ఎన్నికల ప్రక్రియ పరిసమాప్తమైంది. ఏళ్ల తరబడి కొనసాగిన ప్రత్యేక అధికారుల పాలనకు స్వస్తి పలికినట్లయింది.

అలాగే జీవీఎంసీ (విశాఖ మహా నగర పాలక సంస్థ)కు సుమారు తొమ్మిదేళ్ల తర్వాత పాలకవర్గం ఏర్పాటు కావడం గమనార్హం. ఇంకోవైపు.. బెదిరింపులు, దౌర్జన్యాలు చోటుచేసుకున్నా.. ప్రచార పర్వం నుంచి పోలింగ్‌, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, మేయర్‌/డిప్యూటీ మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌- వైస్‌చైర్మన్ల ఎన్నిక.. ఇలా ప్రతి అంకమూ దాదాపుగా శాంతియుతంగానే జరిగింది. 

ఎక్కడా రీపోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం ఏర్పడలేదు. మైదుకూరు, తాడిపత్రి చైర్మన్ల ఎన్నికలపై మొదట్లో భయాందోళనలు వ్యక్తమైనప్పటికీ అవి కూడా శాంతియుతంగానే ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

11 నగర పాలక సంస్థలకు మేయర్లుగా ఎన్నికైన వారిలో ఏడుగురు మహిళలే! విజయనగరం మేయర్‌గా వెంపడాపు విజయలక్ష్మి, విశాఖకు గొలగాని వెంకట హరికుమారి, విజయవాడకు రాయన భాగ్యలక్ష్మి, మచిలీపట్నం-మోకా వెంకటేశ్వరమ్మ, ఒంగోలు-గంగాడ సుజాత, తిరుపతి-డాక్టర్‌ శిరీష, చిత్తూరుకు ఎస్‌.ఆముద మేయర్లుగా ఎన్నికయ్యారు!

మిగిలిన 4 కార్పొరేషన్లలో.. గుంటూరు మేయరుగా కావటి మనోహర్‌నాయుడు, కడప-సురేశ్‌బాబు, కర్నూలు-బి.వై.రామయ్య, అనంతపురం మేయర్‌గా వసీం సలీం ఎన్నికయ్యారు. విజయనగరం డిప్యూటీ మేయర్‌గా ముచ్చు నాగలక్ష్మి, విజయవాడ-బెల్లం దుర్గ, మచిలీపట్నం-తంటిపూడి కవిత, కర్నూలు-సిద్ధారెడ్డి రేణుక, కడప-ముంతాజ్‌ బేగం, అనంతపురం డిప్యూటీగా వాసంతి సాహిత్య ఎన్నికయ్యారు.