ప్రవీణ్ కుమార్‌ పై రాష్ట్రపతికి ఫిర్యాదు 

తెలంగాణలో సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంటులో ఉన్న ఐపీఎస్  అధికారి ప్రవీణ్ కుమార్‌పై రాష్ట్రపతి కోవింద్‌కు నరసాపురం ఎంపీ కె రఘురామకృష్ణ రాజు ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాష్ట్రపతితో భేటీ అయిన ఆయన దేవుడు లేడంటూ ప్రచారం చేస్తున్నారని రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. 
 
లా&జస్టిస్, పర్సనల్ విభాగం స్టాండింగ్ కమిటీలో సభ్యుడిని కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లానని పేర్కొన్నారు. ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ అదుపులో ఉంటే మంచిదని సూచించారు. 
 
కాగా, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో తనపై జరుగుతున్న దాడులను కూడా రాష్ట్రపతికి వివరించానని తెలిపారు. నియోజక వర్గానికి వెళ్లలేని స్థితిని, దాడులు చేస్తామని చేసిన బెదిరింపులను వివరించినట్టు చెప్పారు. 
 
పోలీసు కేసులతో అన్యాయంగా అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. తన ఫిర్యాదును కేంద్ర హోం మంత్రికి పంపిస్తానని రాష్ట్రపతి హామీ ఇచ్చారని చెప్పారు. త్వరలో రాష్ట్రపతి సూచన మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుస్తానని వివరించారు.

గతంలో ఎన్నికలు వద్దని రాద్ధాంతం చేసిన తమ పార్టీ నేతలు, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డపై ఒత్తిడి తెస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సంక్షేమం, నిమ్మగడ్డ తన సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మిగిలిన ఎంపీటీసి, జడ్పీటీసి ఎన్నికలు పూర్తిచేయాలని కోరారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అఖిలపక్షంతో ప్రధానిని కలవడానికి సమయం కోరానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. కానీ అఖిలపక్షంలో ఉండే వారిని ఇంకా ఖరారు చేయలేదని చెప్పారు.