ఓట్ల కోసం కాంగ్రెస్‌ ఎంతకైనా దిగజారుతుంది

ఓట్ల కోసం కాంగ్రెస్‌ ఎంతకైనా దిగజారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. అసోంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్‌ ఫ్రంట్‌తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌.. కేరళలో అదే పార్టీతో తలపడుతోందంటూ ఎద్దేవా చేశారు. 
 
కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనపడిందని.. ఓట్ల కోసం ఎవరితోనైనా చేతులు కలిపేందుకు సిద్ధమైందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతి, వోట్ బ్యాంకు రాజకీయాల కారణంగా అస్సాం రాష్ట్రం ఇతర ప్రాంతాలతో అనుసంధానాన్ని కోల్పోయిందని ప్రధాని ధ్వజమెత్తారు. 
 
కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న రాజకీయాలు అస్సాంకు సాంస్కృతికంగా, భౌగోలికంగా, సామాజికంగా, రాజకీయంగా ప్రమాదమైనవని ప్రధాని హెచ్చరించారు. బీజేపీ మాత్రం అసోం ప్రజల్ని మిగతా దేశంతో ఏకం చేసేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. గత ఐదేళ్ల బిజెపి పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున ఊపందుకున్నాయని చెబుతూ ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతున్నదని ప్రధాని తెలిపారు.
 “2016లో నేను ఇక్కడకు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బరాక్ లోయ డివిజనల్ కమీషనర్ కార్యాలయం గౌహతి నుండి పనిచేయిస్తున్నదని తెలుసుకొని దిగ్బ్రాంతి చెందాను. మా ప్రభుత్వం వచ్చాక ఈ అన్యాయాన్ని సరిచేసాము” అని పేర్కొన్నారు. అప్పట్లో రోడ్ల నాణ్యత అధ్వాన్నంగా ఉండేదని, ఎక్కడకు వెళ్లాలన్నా ప్రజలు చాలాసేపు ప్రయాణం చేయవలసి వచ్చెడిది ప్రధాని గుర్తు చేశారు. అదే విధంగా గ్యాస్ అనుసంధానం కూడా సరిగ్గా ఉండెడిది కాదని చెప్పారు.
బిజెపి ప్రభుత్వం ఈ పరిస్థితులను సత్వరం సరిదిద్దినదని పేర్కొంటూ అనేక కొత్త రోడ్లు, ఫ్లై ఓవర్లు, వంతెనలు నిర్మించిందని వివరించారు. భూపేన్ హజారీ సేతు వంతనను సహితం తమ ప్రభుత్వమే పూర్తి చేసినదని ప్రధాని గుర్తు చేశారు. రైల్వే లైన్ల విస్తరణ, అనేక కొత్త రైళ్లు వేయడం ప్రస్తావిస్తూ గత కొన్నేళ్లలో ఈ ప్రాంతంలో తిరిగే రైళ్ల సంఖ్య రెట్టింపు అయినదని ప్రధాని మోదీ తెలిపారు.
ఆయుష్మాన్‌ యోజన పథకం కింద ఇప్పటి వరకు అసోంలో 1.5 లక్షల మంది ఉచిత వైద్యం పొందారని ప్రధాని చెప్పారు. అలాగే పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా 27 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని పేర్కొన్నారు. నేడు అస్సాంలో అభివృద్ధి ప్రవాహం కనిపిస్తున్నదని, పలు రంగాలలో అభివృద్ధి కార్యక్రమాల కారణంగా యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయని ప్రధాని వివరించారు.