రామమందిర పునాది పనులు ప్రారంభం 

అయోధ్యలో నిర్మించ తలపెట్టిన రామ మందిర పునాది పనులు సోమవారం `వేద పూజ’తో ప్రారంభించారు. 13000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రామ మందిర పునాదిని నిర్మిస్తున్నారు. అలాగే నేలకు 25 అడుగుల ఎత్తులో ఈ పునాదిని నిర్మిస్తున్నారు. అందుకోసం అక్కడి భూమిపై ఇసుక, మట్టి తదితర పదార్థాలతో 50 పొరలు వేస్తున్నారు. 

రామ్ మందిర్ ట్రస్టు అధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత పునాది పనులు మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీలు డా. అనిల్ మిశ్ర, మహంత్ దినేంద్ర దాస్, సెనోర్ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. 

మూడేళ్ళ కాలంలో ఆలయ నిర్మాణం పూర్తవుతుందని ఇంతకు ముందు చంపత్ రాయ్ తెలిపారు. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో, చుట్టూ పరికోట గోడ నిర్మించి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. వరదలకు, భూకంపాలకు ఆలయం దెబ్బతినకుండా నిర్మాణంలో తగు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.