మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్

భారత్ లో కరోనా మళ్లీ విజృంభిస్తుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందని, ప్రస్తుతం ప్రారంభ దశలో ఉందని కేంద్రం స్పష్టం చేసింది.
 
మహారాష్ట్రలో కరోనా పంజా విసరడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. మహారాష్ట్రలో కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని, కంటైన్మెంట్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని లేఖలో మహా ప్రభుత్వానికి ఆయన సూచించారు. 
 
ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనాను గుర్తించడం, టెస్టింగ్, ఐసొలేషన్ (ట్రాక్, టెస్ట్, ఐసొలేట్) వంటి చర్యలను కట్టుదిట్టంగా చేపట్టడం లేదని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా కరోనా  వ్యాప్తి అధికంగా ఉందని, అయితే మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరోనా కట్టడికి తగు చర్యలు తీసుకోవడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. 
 
2020 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తీసుకున్న మాదిరిగానే ఇప్పుడు రాష్ట్రంలో కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మహారాష్ట్రలో కరోనా కట్టడికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తేల్చిచెప్పారు.