70 కరోనా ‘ఆందోళన జిల్లా’లను గుర్తించిన కేంద్రం  

దేశాన్ని అల్లకల్లోలం చేసిన ఏడాది తరువాత కూడా భారతదేశంలో కరోనా వైరస్ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఒకే రోజులో అత్యధిక కేసుల సంఖ్య మంగళవారం కనిపించింది. భారతదేశంలో అత్యధికంగా 28,903 కొత్త ఇన్ఫెక్షన్లతో కొరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,14,38,734 కు చేరింది.
దేశవ్యాప్తంగా టీకాలు వేసే డ్రైవ్ కూడా చేపడుతున్న సందర్భంలో కరోనా కేసులు వెలుగు చూస్తుండటం పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. మొత్తం కేసులలో 76.4 శాతం మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఉండటంతో దేశవ్యాప్తంగా 70 జిల్లాలను ‘ఆందోళన జిల్లాలుగా’ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది.
ముఖ్యంగా ఈ నెల 1-15 మధ్య కేసుల సంఖ్య భయపెట్టే స్థాయిలో పెరుగుతోంది. కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న 70 జిల్లాలలో 13 మహారాష్ట్రలోనివే కావడం గమనార్హం. ఇక్కడి నాందేడ్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 385 శాతం పెరిగింది.  కేసుల సంఖ్య పెరుగుతుండడంతో మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి.
 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిపిన సంభాషణలో కేసుల పునరుత్థానంపై ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో కొవిడ్-19 కేసులు రెండవ స్థాయికి చేరడం పట్ల వేగమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.
కేంద్రం ఆందోళనా జిల్లాలుగా గుర్తించిన జిల్లాలు పంజాబ్‌, హర్యానా, ఛండీగఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణా, తూర్పు గోదావరి, విశాఖపట్నం, చిత్తూరు, గుంటూరు జిల్లాలు ఆందోళనా జిల్లాల జాబితాలో ఉన్నాయి.
మహా­రా­ష్ట్రలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య బాగా పెరుగుతున్నది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 23 లక్షలు, యాక్టివ్ ‌కేసుల సంఖ్య 1.5 లక్షలు దాటింది. 
 
మంగళవారం నుంచి బుధవారం వరకు రికార్డుస్థాయిలో కొత్తగా 23,179 కరోనా కేసులు, 84 మర­ణాలు నమో­ద­య్యాయి. దీంతో మహా­రా­ష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,70,507కు, మర­ణాల సంఖ్య 53,080కు చేరింది. ముంబైలో కూడా రికార్డుస్థాయిలో 2,377 కరోనా కేసులు నమోదయ్యాయి.