కొవిడ్ సెకండ్ వేవ్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆపాల్సిందే

దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆపాల్సిందేన‌ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. దీనికోస నిర్ణ‌యాత్మ‌క అడుగులు వేయాల‌ని చెప్పారు. దేశంలో కొవిడ్ మ‌హ‌మ్మారి మ‌రోసారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో బుధ‌వారం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో స‌మావేశ‌మయ్యారు. 

కరోనాతో ప్రభావితమైన చాలా దేశాలు రెండో వేవ్‌ను చవిచూస్తున్నాయని, మన దేశం కూడా ఆ జాబితాలోకే వస్తుందని మోదీ హెచ్చరించారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు అమాంతం పెరిగిపోయాయని, ఈ విషయంపై ముఖ్యమంత్రులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని ఆయన తెలిపారు.

రాష్ట్రాల అభ్య‌ర్థ‌న మేర‌కు 45 ఏళ్లు పైబ‌డిన వాళ్లంద‌రికీ వ్యాక్సిన్ ఇవ్వాల‌ని ఈ స‌మావేశంలో కేంద్ర‌ ఆరోగ్య శాఖ ప్ర‌తిపాదించింది. ఇక క‌రోనాకు చెక్ పెట్ట‌డానికి మాస్క్‌లు త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని, భౌతిక దూరం నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని ఈ సంద‌ర్భంగా రాష్ట్రాల‌కు కేంద్రం సూచించింది. 

జ‌నం గుమిగూడే అవ‌కాశం ఉన్న ఈవెంట్ల‌లో అద‌న‌పు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కూడా స్ప‌ష్టం చేసింది. టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌మెంట్‌, వ్యాక్సినేష‌న్ ప‌క్రియ కొన‌సాగాల‌ని సూచించింది. ఇక భారత్లో  ఇప్ప‌టి వ‌ర‌కూ 96 శాతం మంది కోలుకున్నార‌ని, చ‌నిపోయిన వారి సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉన్న దేశాల్లో భారత్  కూడా ఒక‌ట‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ చెప్పారు.

కోవిడ్ నేపథ్యంలో అవసరమున్న చోట్ల ‘మైక్రో కంటెయిన్మెంట్’ జోన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ భయభ్రాంతులకు గురిచేయవద్దని, అలాంటి వాతావరణాన్ని సృష్టించవద్దని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు, మరికొన్ని చర్యలు తీసుకుందామని, అంతేగానీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

కొన్ని ప్రాంతాల్లో టెస్టుల సంఖ్య త‌గ్గ‌డాన్ని మోదీ ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. ఎందుకు టెస్టుల సంఖ్య త‌గ్గింద‌ని ప్ర‌శ్నించారు. మ‌న కాన్ఫిడెన్స్‌, ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌గా మార‌కూడ‌దు అని స్ప‌ష్టం చేశారు. సుపరిపాలన అందించడానికి ఇదే సరైన సమయం అని తెలిపారు. 

ఇక వ్యాక్సిన్ వృథాపై కూడా ప్ర‌ధాని మాట్లాడారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ల‌లో వ్యాక్సిన్ వృథా 10 శాతం కంటే ఎక్కువ‌గా ఉన్న‌ద‌ని మోదీ చెప్పారు. రాష్ట్రాలు వ్యాక్సిన్ వృథాను స‌మీక్షించాల‌ని సూచించారు. అస‌లు ఎందుకు వృథా అవుతోందో ప్ర‌తి రోజూ పర్య‌వేక్షించాల‌ని, అస‌లు వృథా లేకుండా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు.