మ‌మ‌త‌కు ఎన్నిక‌ల సంఘం హెచ్చ‌రిక‌

ప‌దే ప‌దే త‌మ‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్న ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి ఎన్నిక‌ల సంఘం బ‌ల‌మైన సందేశాన్ని పంపించింది. ప్ర‌తిసారీ అధికార పార్టీకి కొమ్ముకాస్తోందంటూ ఎన్నిక‌ల సంఘం స్థాయిని దిగ‌జార్చ‌డం స‌రికాద‌ని స్ప‌ష్టం చేసింది. పదే ప‌దే ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోవాల‌ని సూచించింది. 
 
ఇప్ప‌టికే తృణ‌మూల్ కాంగ్రెస్ ప్ర‌తినిధుల‌ను కోల్‌క‌తాలో, ఢిల్లీలో రెండుసార్లు ఎన్నిక‌ల సంఘం క‌లిసింది. అయినా కూడా ఈసీ పార్టీల‌ను క‌ల‌వాల‌ని అన‌డం సంఘం ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చ‌డమే అవుతుంద‌ని ఎన్నిక‌ల సంఘం స్ప‌ష్టం చేసింది. చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ సునీల్ అరోరాకు మ‌మ‌త రాసిన లేఖ‌కు ఈసీ స‌మాధాన‌మిచ్చింది. 
 
ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌ ఓ రాజ‌కీయ పార్టీకి మేలు చేస్తోంద‌ని మ‌మ‌త ప‌దే ప‌దే ఆరోపించ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని స్ప‌ష్టం చేసింది. మంగ‌ళ‌వారం ఎన్నికల ప్ర‌చారంలో పాల్గొన్న మ‌మ‌త‌.. కేంద్ర హోంమంత్రి ఆదేశాల ప్ర‌కార‌మే ఎన్నిక‌ల సంఘం ప‌ని చేస్తోంద‌ని ఆరోపించారు. 

ఎన్నికల ప్రచార సభలలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కమిషన్‌ ప్రతిష్టను దిగజార్చేలా, అవమానించేలా ఉన్నాయంటూ మమతా బెనర్జీకి ఘాటుగా లేఖ రాసింది. రాష్ట్ర పోలీస్‌ ఉన్నతాధికారిని కమిషన్‌ భర్తీ చేయడంతో ఈ వివాదం ప్రారంభమైన సంగతి తెలిసిందే. 

కోల్‌కతా, ఢిల్లీలో ఎన్నికల సమావేశాలు జరుగుతాయని, కమిషన్‌ రాజకీయ నేతలతో సమావేశమవ్వాలని గౌరవప్రదమైన సిఎం పేర్కొన్నట్లయితే అది ఎన్నికల కమిషన్‌ను తక్కువ చేసినట్లే అవుతుందని డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ సుదీప్‌ జైన్‌ లేఖలో పేర్కొన్నారు. 

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు సన్నిహితంగా ఉండే అధికారులను బదిలీ చేయడం సర్వసాధారణం. అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే మమతా బెనర్జీ వివాదాలను సృష్టిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆమె పట్టుదలతో ఉండటం దురదృష్టకరం. ఆమె ఎందుకు అలా చేస్తున్నారనే దానిపై మమతానే సమధానం చెప్పాల్సి వుంటుందని స్పష్టం చేశారు. 

కాగా, మంగళవారం జరిగిన ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్‌ను ఎవరు నిర్వహిస్తున్నారు? అమిత్‌షా మీరు నిర్వహిస్తున్నారా..? మాకు నిస్వార్థమైన, న్యాయమైన ఎన్నికలు కావాలని, అమిత్‌షా ఎవరు ఇసికి మార్గదర్శకం చేయడానికి, ఆయన ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని.. ఇది మాకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. సెక్యూరిటీ ఇన్‌చార్జీని కూడా తొలగించారని, వారికి ఏం కావాలి.. నన్ను చంపాలనుకుంటున్నారా అని నిలదీశారు.