అంబానీ ఇంటివద్ద `ప్రేలుడు’ కారు  ఉంచింది పోలీస్!  

పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన కారు కేసులో కీలక మలుపు. పోలీస్‌ అధికారి సచిన్‌ వాజే ఆ కారును అక్కడ పార్క్‌ చేశాడని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అనుమానం వ్యక్తం చేసింది. కారు పార్కింగ్‌ చేస్తున్నప్పుడు పీపీఈ కిట్‌లో అక్కడ కదలాడుతున్న వ్యక్తి సచిన్‌ వాజేనే కావొచ్చని పేర్కొన్నది.

అయితే దీనిని ఇంకా ధ్రువీకరించాల్సి ఉందని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. పీపీఈ కిట్‌ ధరించిన వ్యక్తి లోపల కుర్తా వేసుకొన్నట్టు ఎన్‌ఐఏ తెలిపింది. కారు పార్కు చేసిన అనంతరం ఆధారాలను ధ్వంసం చేయడంలో భాగంగా కుర్తాను కిరోసిన్‌తో కాల్చివేసినట్టు పేర్కొన్నది.

ఈ కేసులో సచిన్‌ వాజేతో పాటు మరికొంతమంది పోలీసు ఉన్నతాధికారుల హస్తం ఉందని తెలిపింది. వారి సూచనలతోనే వాజే ఆ పనిచేశారని అధికారులు తెలిపారు. దర్యాప్తులో కొందరి పేర్లు బయటకు వచ్చాయని, కుట్రను త్వరలోనే ఛేదించి వివరాలు వెల్లడిస్తామని  భరోసా వ్యక్తం చేశారు.

అంబానీ ఇంటిదగ్గర వాహనం నిలిపి ఉంచిన కేసును మొదట వాజేనే పర్యవేక్షించారు. అయితే, స్వయంగా ఆయనపైనే అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ఎన్‌ఐఏ ఈ నెల 13న సచిన్‌ వాజేను అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది. మంగళవారం వాజేకు చెందిన మెర్సిడెజ్‌ బెంజ్‌ కారును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

అందులో 5 లక్షల నగదు, కొన్ని దుస్తులు, కిరోసిన్‌ బాటిల్‌ను గుర్తించారు. దీనిపై ప్రశ్నించగా ఆధారాలను ధ్వంసం చేయడానికి కిరోసిన్‌ను తీసుకొచ్చినట్టు దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులపై ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొన్నది. ముంబై పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌సింగ్‌కు స్థానచలనం కలిగించింది. ఆయనను అంతగా ప్రాధాన్యంలేని హోంగార్డు డీజీగా బదిలీ చేస్తున్నట్టు రాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ బుధవారం వెల్లడించారు.

 పరమ్‌బీర్‌ స్థానంలో కొత్త పోలీస్ కమీషనర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి హేమంత్‌ నగ్రాలే ముంబై పోలీస్‌ కీర్తి ప్రతిష్ఠలను తిరిగి సాధిస్తామని చెప్పారు. ప్రస్తుతం కొన్ని చెడు సంఘటనల కారణంగా ముంబై పోలీస్‌ గందరగోళంలో ఉన్నదని హేమంత్‌ పేర్కొన్నారు. అయితే  ముంబై పోలీసుల కీర్తి, ప్రతిష్ఠలను తిరిగి  పొందుతామని ధీమా వ్యక్తం చేశారు.