17న కరోనాపై సీఎంలతో ప్రధాని సమావేశం  

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగే ఈ భేటీలో ప్రధానంగా దేశంలో మరోసారి పెరుగుతున్న కరోనా కేసులు, వైరస్ నియంత్రణ చర్యలపై చర్చించనున్నారు. 

ఇప్పటికే పలు రాష్ట్రాలు తగిన చర్యలను తీసుకుంటున్నాయి. మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్, రాత్రి సమయంలో కర్ఫ్యూను విధిస్తూ కరోనాను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు ఏం చర్యలు తీసుకుంటే కరోనాను కట్టడి చేయవచ్చన్న సమాలోచన జరపనున్నారు. 

దీంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలను కూడా ప్రధానికి వివరించనున్నట్లు తెలుస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏం చేద్దాం? అన్న విషయంపైనే ప్రధానంగా చర్చించనున్నారు. పది వేల కరోనా కేసుల నుంచి ప్రస్తుతం రోజుకు 26 వేలకు పెరిగాయి. దీంతో కేంద్రం కూడా అప్రమత్తమైంది.

ప్రధాని మోదీ గతంలో కూడా పలు సార్లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎంలతో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై ఆరా తీశారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభానికి ముందు ఈ ఏడాది జనవరిలో చివరిసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.