మమతా నామినేషన్ పై సువేందు అభ్యంతరం

పశ్చిమబెంగాల్  ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ దాఖలు చేసిన నామినేషన్ పై ఆమె ప్రత్యర్థి, బీజేపీ నేత సువేందు అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. మమతపై ఆరు క్రిమినల్ కేసులు ఉన్నాయని, వాటిని అఫిడవిట్ లో ఆమె తెలపలేదని వెల్లడించారు. 

ఈ విషయమై తాను ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని చెప్పారు. 2018లో ఐదు ఎఫ్ఐఆర్ లు, సీబీఐ ఒక ఎఫ్ఐఆర్  దాఖలు చేసిందని సువేందు పేర్కొన్నారు. వీటిని తొలగించాలని కోరుతూ మమతా కొలకత్తా హై కోర్ట్ ను ఆశ్రయించినా, ఆమె అభ్యర్ధనను హైకోర్టు తిరస్కరించిందని చెప్పారు.

ఆమెపై ఉన్న కేసులకు సంబంధించి సాక్ష్యాలను కూడా ఈసీకి సమర్పించానని పేర్కొంటూ ఈ అంశంపై ఈసీ సరైన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఆమె నామినేషన్ చెల్లుబాటు కాదని నామినేషన్ల పరిశీలన రోజున కూడా స్పష్టం చేయగలమని చెప్పారు. 

ఇలా ఉండగా,  మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో గాయపడిన ఘటనకు సంబంధించి డెరెక్టర్‌ సెక్యూరిటీ వివేక్ సహాయ్‌‌ను ఎన్నికల కమీషన్ తొలగించింది. దానితో కొత్త డెరెక్టర్ ఆఫ్ సెక్యూరిటీగా ఐపీఎస్ అధికారి జ్ఞాన్‌వంత్ సింగ్‌ను ప్రభుత్వం నియమించింది. 

చీఫ్ సెక్రటరీ అలపన్ బందోపాధ్యాయ్, డీజీపీ పి.నీరజ్‌నయన్ మధ్య జరిగిన సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ సెక్యూరిటీగా ఉన్న సింగ్‌ను నియమించాలనే నిర్ణయం తీసుకున్నారు. డెరెక్టర్ ఆఫ్ సెక్యూరిటీగా ఉన్న సహాయ్‌ను ఈసీ ఆదివారంనాడు తప్పుపట్టింది. జడ్ ప్లస్ ప్రొటక్టీకి రక్షణ కల్పించాల్సిన ప్రాథమిక బాధ్యతను నిర్వహించడంలో సహాయ్ విఫలమయ్యాడని పేర్కొంటూ ఆయనను ఆ బాధ్యత నుంచి ఈసీ తొలగించింది.