చంద్ర‌బాబుకు ఏపీ సీఐడీ నోటీసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నివాసానికి ఏపీ సీఐడీ అధికారులు ఈ ఉద‌యం వ‌చ్చారు. అమ‌రావ‌తి అసైన్డ్ భూ వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబుకు నోటీసులు ఇచ్చేందుకు హైద‌రాబాద్‌లోని ఆయన నివాసానికి సీఐడీ అధికారులు వ‌చ్చారు.

భూముల అమ్మ‌కాలు, కొనుగోళ్ల‌పై అంశంపై బాబుకు నోటీసులు ఇచ్చారు. చంద్ర‌బాబుతో పాటు మాజీ మంత్రి నారాయ‌ణ‌కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. టీడీపీ హయాంలో నారాయణ పురపాలక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ కేసులో ఉన్న దాదాపు ఎనిమిది మంది పేర్లను నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామ‌ని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు.

రెండు బృందాలుగా వెళ్లిన సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో కూడా అధికారులు మాట్లాడారు. ఎప్పుడు విచారణకు పిలిచినా తప్పకుండా హాజరుకావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారట. ఈ నెల 23న బాబు విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. చంద్ర‌బాబుపై 120 బీ, 166, 167, 217 సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు.

కాగా.. చాలా రోజులుగా అమరావతిలో అసైన్డ్‌ భూముల కొనుగోలుపై రాద్ధాంతం జరుగుతోంది. రాజధాని ప్రకటనకు ముందే తన అనుచరులకు సమాచారం ఇచ్చి అక్కడ దళితులకు చెందిన అసైన్డు భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలతో కేసు నమోదు అయినట్లు సమాచారం. అసైన్డ్‌ రైతులను మోసం చేసి తన అనుచరులకు లబ్ధి కలిగించారని ఆరోపణలు ఉన్నాయి.

సుమారు 500 ఎకరాల అసైన్డ్ భూముల బదలాయింపుకు సంబంధించి చంద్రబాబుపై అధికారులు కేసు నమోదు చేశారు. కేబినెట్ ఆమోదం లేకుండానే ఈ భూములను ల్యాండ్‌పూలింగ్‌లో చేర్చడానికి జీవో ఇచ్చారని ప్రధాన అభియోగం మోపారు దీనిపై హైకోర్టులో కూడా విచారణ జరిగింది. ఈ విషయంలో చంద్రబాబుకు సంబంధం లేదంటూ న్యాయస్థానం చెప్పింది. కాగా.. రాజధాని ప్రకటన తర్వాత భూముల ధరలు విపరీతంగా పెరిగాయని.. అసైన్డ్‌ రైతులు మోసపోయి..అనుచరులకు లబ్ధి కలిగించారని కేసు నమోదు చేసారు.