`హిందూ’ ఎజెండాతో డీఎంకే అధినేత స్టాలిన్!

`హిందూ’ ఎజెండాతో డీఎంకే అధినేత స్టాలిన్!

ఈ సారి ఏదిఏమైనా అధికారమలోకి రావాలని ఒక విధంగా అసహనంతో  వ్యవహరిస్తున్న డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పూర్తిగా `హిందూ ఎజెండా’ చేపట్టడం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తున్నది. 

నాస్తికవాదమే పునాదిగా,  హిందూ వ్యతిరేకత విధానంగా అర్ధ శతాబ్దికాలంకు పైగా తమిళనాడు రాజకీయాలలో  ఒక రాజకీయ వరవడికి సంధానకర్తగా వ్యవహారిస్తూ వస్తున్న ద్రావిడ ఉద్యమంకు వారసునిగా చెప్పుకొనే స్టాలిన్ ఇటువంటి అజెండా చేపట్టడం రాజకీయ వర్గాలలో సంచలనం కలిగిస్తున్నది. 

రాష్ట్రంలో ఆలయాల ఉద్ధతికి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించడం. అంతేకాక- పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే వారికి రూ 25,000 నుంచి లక్ష రూపాయల దాకా ఆర్థికసాయం.  వీటితో పాటు హిందూ ఓటర్లను ఆకట్టుకునే అనేక అంశాలను ఎన్నికల ప్రణాళికలో చేర్చారు. హిందుత్వ పార్టీగా పేరొందిన బిజెపి సహితం తాను అధికారంలో ఉన్న రాష్ట్రాలలో సహితం ఇటువంటి అంశాలను ఎన్నికల ప్రచారంలో చేర్చలేదు.

ద్రవిడ ఉద్యమ పిలామహుడు పెరియార్‌ రామస్వామికి నిజమైన వారసుణ్ణని తనను తాను అభివర్ణించుకున్న కరుణానిధి ఏ ఎన్నికల్లోనూ ఆయన హిందూ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేయలేదు. జీవిత కాలంలో ఒక్క ఆలయాన్నీ సందర్శించలేదు,  ఒకే ఒకసారి వేరే అంశానికి సంబంధించి పుట్టపర్తి సాయిబాబాతో వేదిక పంచుకున్నారంతే!

ఇపుడు ఆయన రాజకీయ వారసుడు స్టాలిన్‌ తద్భిన్నమైన మార్గాన్ని అనుసరిస్తున్నారు. కరుణానిధి జీవించి ఉన్నప్పుడే ఆయన పలు సందర్భాలలో దేవాలయాల సందర్శన, హిందూ ఉత్సవాల పట్ల ఆసక్తి కనబరుస్తూ వచ్చారు.  తమిళనాడులో గత కొంతకాలంగా బలపడుతున్న ద్రావిడ వ్యతిరేక ధోరణులు, హిందూ అనుకూల వాదనలను రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసమే స్టాలిన్ ఈ విధంగా చేస్తున్నారనే అభిప్రాయం కలుగుతున్నది.

తమిళనాడులో దాదాపు 43,000 ఆలయాలున్నాయి. కొన్ని జీర్ణావస్థలో ఉన్నాయి. వాటిని పునరుద్ధరించడమే కాక, లక్షల ఎకరాల ఆలయ భూముల పరిరక్షణ కూడా స్టాలిన్‌ ఎజెండాలో ఉన్నాయి. అన్నాడీఎంకేతో చెలిమి తరువాత బీజేపీ హిందూ వర్గాలను సంఘటితం చేయడానికి ప్రయత్నిస్తోందని స్టాలిన్‌ అర్థం చేసుకున్నారు. దీనిని కౌంటర్ చేయడం కోసమే హిందూ-వ్యతిరేక ముద్రను చెరిపేసుకోవడం అవసరమని స్టాలిన్‌ నిర్ణయించుకొన్నట్లు కనిపిస్తున్నది. తమిళ ఓటర్లలో ఎక్కువమంది దైవభక్తి పరులున్నారు. డీఎంకే ఆలయ-వ్యతిరేకి అన్న అపప్రధను తొలగించుకోవడం తప్పదని నిశ్చయించుకున్నట్లు స్పష్టం అవుతుంది.

తమిళనాడు లోని మిగిలిన అన్ని ద్రవిడ పార్టీలు- అన్నాడీఎంకే, పాటాలి మక్కల్‌ కచ్చి, విజయ్‌కాంత్‌ నేతృత్వంలోని డీఎండీకే, కమల్‌ హాసన్‌ నాయకత్వంలోని   మక్కల్‌ నీది మయ్యమ్‌ (ఎంఎన్‌ఎం), వైకో నేతృత్వంలోని మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కళగం (ఎండీఎంకే)… మొదలైనవి సహితం ఇప్పుడు హేతువాద సిద్ధాంతాలను అనుసరించడం లేదు. 

మిగిలిన పార్టీల నేతలందరూ నామినేషన్‌ దాఖలు సమయంలోనూ, ప్రచార సందర్భంలోనూ ఆలయాలు సందర్శిస్తున్నారు. అయితే డీఎంకే ప్రకటించిన ఈ ‘హిందూ ఎజెండా’ పెద్ద జోక్‌ అనీ, ఓటర్లెవరూ నమ్మరని బీజేపీ, అన్నాడీఎంకే నేతలు విమర్శిస్తున్నారు. 

డీఎంకే `హిందూ ఎజెండా’ లోని ప్రధాన అంశాలు

  • కాశీ, కేదార్‌నాధ్‌, బదరీనాథ్‌, పురి, గోకర్ణం, తిరుపతి, రామేశ్వరం, మథుర సహా దేశంలోని ఏ ప్రముఖ ఆలయానికి వెళ్లేందుకైనా రూ 25,000 నుంచి లక్ష రూపాయల సాయం
  • పతనావస్థలో ఉన్న, మరమ్మతులు అవసరమైన కోవెళ్లకు – ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాలకు రూ 1000 కోట్లు కేటాయింపు
  • తిరుత్తణి, శోలింగార్‌, తిరునీర్‌మలై, తిరుచ్చి, మలైకొట్టై, తిరుచెంగాడ్‌ ఆలయాల్లో కేబుల్‌ కార్‌ సౌకర్యం
  • తిరువణ్ణామలై(అరుణాచలం)లో గిరిప్రదక్షిణం చే సే మార్గం వెంబడి హరిత వనం ఏర్పాటు. ఆ 16 కిలోమీటర్ల పరిధిలోని ఆలయాలకు కొత్త సొబగులు
  • వళ్లలార్‌ భక్తులకు వడలూర్‌లో కేంద్రం ఏర్పాటు
  • గ్రామాల్లో ఆలయ పూజారులకు నెలకు రూ 2000. పింఛను కూడా రాష్ట్రవ్యాప్తంగా అర్చకులకు రూ 3000 నుంచి రూ 4000 కు పెంపు
  • వేదవిద్యను, ఆలయ సంప్రదాయాలను నేర్చుకున్న బ్రాహ్మణేతరులైన 205 మంది ఇతర కులస్థులకు వెంటనే ఆలయాల్లో పూజారిగా నియామకం