అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించం 

అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించమని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఏదీ జరిగినా…ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని హామీనిచ్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్రం ప్రతిపాదనకు వ్యతిరేకంగా తొమ్మిది కార్మిక సంఘాలు రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి. 
 
రూ.1.75 లక్షల కోట్లు సమీకరణ కోసం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ ప్రణాళికతో ఈ సమ్మె చేపట్టారు. ఈ  నేపథ్యంలో ఆమె కీలక ప్రకటన చేశారు. దేశ ఆకాంక్షలను బ్యాంకులు తీర్చాలని తాము కోరుకుంటున్నామని ఆమె తెలిపారు.
 ‘ కొన్ని బ్యాంకులను మాత్రమే ప్రైవేటీకరిస్తాం.ప్రతి బ్యాంకు సిబ్బంది ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. ఎంత ఖర్చైనా ఉద్యోగుల ప్రయోజనాలను రక్షిస్తాం’ అని ఆమె భరోసా ఇచ్చారు .బ్యాంకులకు మరింత ఎక్కువ ఈక్విటీ రావాలని, దేశ ప్రజల ఆకాంక్షలను బ్యాంకులు నెరవేర్చాలని తాము కోరుకుంటున్నామని ఆమె చెప్పారు. 
 
“ప్రైవేటీకరణ నిర్ణయం బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ప్రభుత్వ రంగ బ్యాంకులు కొనసాగుతాయని పబ్లిక్‌ ఎంటర్‌ప్రైస్‌ పాలసీ స్పష్టంగా చెబుతోంది. అలాంటప్పుడు అన్ని ప్రభుత్వ బ్యాంకులను విక్రయిస్తున్నారని చెప్పడం సరికాదు. అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించట్లేదు’ అని ఆమె స్పష్టం చేశారు.  ప్రైవేటీకరించే బ్యాంకుల ప్రతి సిబ్బంది వేతనాలు, పింఛన్లు వంటి ప్రయోజనాలను తాము రక్షిస్తామని సీతారామన్ హామీ ఇచ్చారు.
 ప్రభుత్వ రంగ సంస్థలతో తాము కొనసాగుతామని ప్రభుత్వ రంగ సంస్థ విధానం చాలా స్పష్టంగా చెబుతుందని ఆమె పేర్కొన్నారు. 
 
 పీఎస్‌బీల్లో వేల సంఖ్యలో ఉద్యోగులు ఉండటంతో ప్రైవేటీకరణ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఉదాహరణకు.. యూనియన్ల గణాంకాల ప్రకారం బీవోఐలో 50,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. అలాగే సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 33,000 మంది, ఐవోబీలో 26,000 మంది, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో 13,000 మంది దాకా సిబ్బంది ఉన్నారు.