రైల్వేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేటీకరించబొం 

భారతీయ రైల్వేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేటీకరించబోమని కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు. అయితే మరింత సౌకర్యవంతంగా రైల్వేని తీర్చిదిద్దేందుకు ప్రయివేటు పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన తేల్చి చెప్పారు. రైల్వేలు సదా భారత ప్రభుత్వంతోనే ఉంటాయని  లోక్‌సభలో తెలిపారు. 
 
 రైల్వే గ్రాంటుల కోసం వస్తున్న డిమాండ్లపై చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు గోయల్ స్పందింస్తూ  ‘‘భారతీయ రైల్వేను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించబోం. అది ప్రతిఒక్క భారతీయుడి ఆస్తి. ఎప్పటికీ అలాగే ఉంటుంది. భారత ప్రభుత్వంలో భాగంగానే కొనసాగుతుంది…’’ అని స్పష్టం చేశారు. 
 
‘రైల్వేలను ప్రైవేటీకరించినట్లు మాపై ఆరోపణలు ఉన్నాయి. కానీ, ప్రభుత్వ వాహనాలు మాత్రమే రోడ్లపై నడపాలని ప్రజలు ఎప్పుడూ అనరు. ఎందుకంటే ప్రైవేట్, ప్రభుత్వ వాహనాలు రెండూ ఆర్థికంగా సహాయపడతాయి. రైల్వేలో పెడుతున్న ప్రైవేట్ పెట్టుబడులు ఇక్కడ సేవలను మరింత మెరుగు పరుస్తాయనే ఉద్దేశంతోనే మనం స్వాగతించాలి” అని గోయల్ చెప్పారు.

 ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో దేశ రైల్వే మౌలిక సదుపాయాలు కొత్త విజన్‌ను చూశాయని, రైల్వే ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాలకు సమృద్ధిని తీసుకొచ్చినట్లు పియూష్‌ గోయల్ చెప్పారు. భారత రైల్వేలు దేశానికి ‘వృద్ధికి ఇంజిన్’గా పనిచేయాలని మేం కోరుకుంటున్నాం అని తెలిపారు. 

మోదీ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ రైల్వేలో పెట్టుబడులను రూ. 2.15 లక్షల కోట్లకు పెంచిందని గుర్తు చేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 1.5 లక్షల కోట్లుగా ఉంది. రెండేళ్లుగా భారతీయ రైల్వేలోప్రమాదాల కారణంగా ఒక్కరుకూడా చనిపోలేదని మంత్రి పేర్కొన్నారు.
 
‘‘ప్రయాణికుల భద్రత, పెట్టుబడులకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తోంది. రైల్వే ప్రమాదం కారణంగా ఓ ప్రయాణికుడు మృతిచెందిన ఘటన చివరి సారి 2019 మార్చిలో చోటుచేసుకుంది. అయితే 2019 నుంచి 2021 వరకు రెండేళ్లుగా ఒక్కరు కూడా ప్రమాదాల్లో చనిపోలేదు…’’ అని గోయల్ వివరించారు.