మయన్మార్ ఆందోళనల్లో మరో ఐదుగురు మృతి 

మయన్మార్‌లో ఆదివారం జరిగిన ఆందోళనల్లో మరో ఐదుగురు మరణించారు. 15 మంది గాయపడ్డారు. యాంగాన్‌ నగరంలో ముగ్గురు, వేర్వేరు ప్రాంతాల్లో మరో ఇద్దరు మరణించారు. గత నెల్లో సైనిక కుట్ర జరిగినప్పటి నుంచి ఆరు వారాలుగా కొనసాగుతున్న నిరసనలపై భద్రతా బలగాలు అణచివేత చర్యలకు పాల్పడుతున్నాయి. 
 
ఆదివారం నాటి ఘటనలో భద్రతా బలగాలు నిరసనకారులపై కాల్పులు జరపడంతో ఒక వ్యక్తికి తలలో తూటా దూసుకువెళ్లగా, మరొకరికి కడుపులోకి వెళ్లిందని స్థానిక మీడియా తెలిపింది. హ్యాండ్‌మేడ్‌ కవచాలు ధరించి, హెల్మెట్లు పెట్టుకుని మరీ ఆందోళనకారులు నిరసనల్లో పాల్గనడం కనిపించింది. 
 
శనివారం నాటికి నిరసనల్లో 80 మంది మరణించగా, 2,100 మంది అరెస్టయ్యారు. కొంతమంది మాస్క్‌లు ధరించి, కొంతమంది ధరించకుండా వీధుల్లో ఆందోళన చేస్తున్న దృశ్యాలు, వీడియోలు సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి. వారిపై పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టడం, ప్రజలు గట్టిగా అరుస్తూ పరుగులు తీయడం కనిపిస్తోంది. 
 
ఆందోళనకారులు అగ్నిమాపక యంత్రాలను ఉపయోగించి తప్పించుకోవడానికి యత్నించారు. పోలీసులు ఉపయోగించిన రబ్బర్‌ బుల్లెట్ల వల్ల కొంతమంది గాయపడ్డారు. యాంగాన్‌ నగరంలో పలు చోట్ల ఆందోళనకారులు రోడ్లపై ముళ్ళ కంచెలను, ఇసుక బస్తాలను అడ్డంగా పెట్టి భద్రతా బలగాలను నిలువరించేందుకు యత్నించడం కనిపించింది.  ”న్యాయం కావాలి” అంటూ వారు నినదించారు. శనివారం నాటి నిరసనల్లో మరణించిన వారి సంఖ్య 13కు పెరిగింది.

సైన్యాన్ని అధికారం నుండి దింపడానికి విప్లవాన్ని కొనసాగిస్తామని పదవీచ్యుతుడైన మయన్మార్‌ ఉపాధ్యక్షుడు మాన్‌ విన్‌ ఖయింగ్‌ తన్‌ స్పష్టం చేశారు. కుట్ర తర్వాత మొదటిసారిగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఆయన, ఇవి చీకటి రోజులని ధ్వజమెత్తారు. సూర్యోదయమయ్యే సమయం దగ్గరపడిపందని చెప్పారు. 
 
ఫెడరల్‌ ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసేందుకు గానూ మనందరం కలిసి కట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు తమని తాము కాపాడుకోవాలని ఆయన కోరారు.