శ్రీలంకలో బుర్ఖాపై నిషేధం… వెయ్యికి పైగా ఇస్లామిక్‌ స్కూళ్ల మూసివేత 

ముస్లింలకు సంబంధించిన శ్రీలంక ప్రభుత్వం కీలక  నిర్ణయం తీసుకుంది. మహిళలు ధరించే బుర్ఖాపై నిషేధం విధించడంతో పాటు..వెయ్యికి పైగా ఇస్లామిక్‌ స్కూళ్లను మూసివేయాలన్న నిర్ణయాన్ని తీసుకుంది. శనివారం ఈ విషయాన్ని ప్రజా భద్రతా శాఖ మంత్రి శరత్‌ వీర శేఖర వెల్లడించారు. 
 
జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని…కొందరు మహిళలు పూర్తిగా మోహన్ని కప్పి ఉంచే బుర్జా ధరించడంపై నిషేధం విధించేందుకు క్యాబినేట్‌ ఆమోదం కోసం సంతకాలు చేసినట్లు చెప్పారు. చిన్ననాటి నుండి తమకు అనేకమంది ముస్లిం యువతులు స్నేహితులుగా ఉన్నారని, వారెవ్వరూ బురఖాలు ధరించడం తామెప్పుడూ చూడలేదని ఆయన స్పష్టం చేశారు. 
 
గతంలో ముస్లిం మహిళలు, యువతులు బుర్ఖా ధరించిన ఆనవాళ్లు లేవని చెబుతూ ఈ మధ్య కాలంలోనే ప్రారంభమైన ఈ ఆనవాయితీ మతోన్మాదానికి సంకేతమని ఆయన మండిపడ్డారు.  దీనిపై ఖచ్చితంగా వేటు వేస్తామని స్పష్టం చేశారు. దీనితో పాటు మదరసాలను సహితం మూసివేస్తామని తెలిపారు. 

కాగా, ఇలా బుర్ఖాపై శ్రీలంక నిషేధం విధించడం కొత్తమీ కాదు. బుద్ధులు అత్యధికంగా ఉన్న ఈ దేశంలో 2019లో చర్చిలు, హోటల్స్‌పై ఇస్లామిక్‌ మిలిటెంట్లు బాంబు దాడులు జరపడంతో…అప్పుడు తాత్కాలికంగా బుర్ఖాలపై తాత్కాలిక నిషేధం విధించారు. ఆ ఘటనలో 250 మందికిపైగా మరణించిన సంగతి విదితమే.