`ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్’ సచిన్ వాజే అరెస్ట్ 

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత అంబానీ ఇంటి వద్ద బాంబు కేసులో పోలీస్​ అధికారి సచిన్​ వాజేను జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) శనివారం రాత్రి అరెస్టు చేసింది. ఈ విషయాన్ని ఎన్ఐఏ ప్రతినిధి తెలిపారు.

12 గంటల పాటు విచారణ జరిపిన తర్వాత వాజేను అరెస్టు చేశామని స్పష్టం చేశారు. దక్షిణ ముంబైలోని కుంబల్లా హిల్‌లోని ఏజెన్సీ ముంబై కార్యాలయంలో సచిన్‌ వాజ్‌ను వాంగ్మూలం నమోదు చేసేందుకు పిలిచింది. ఉదయం 11.30 నుంచి సుదీర్ఘ సమయం పాటు ఎన్ఐఏ విచారించింది. 

పేలుడు పదార్థాలతో నిండిన కారును అంబానీ ఇంటి వద్ద ఉంచడంలో ఆయన పాత్ర ఉండడంతో అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముంబై పోలీసుల వాంగ్మూలాన్ని కూడా ఎన్ఐఏ నమోదు చేసింది. 

286, 465, 473, 506 (2), 120 బి ఐపిసి, మరియు 4 (ఎ) (బి) (ఐ) పేలుడు పదార్థాల చట్టం 1908 కింద  వాజేను అరెస్టు చేశామని వెల్లడించారు. ఈ విషయంలో మహారాష్ట్ర మాజీ  సీఎం, బీజేపీ నేత దేవంద్ర ఫడ్నవీస్‌ కూడా వాజేపాత్రపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపింది.

ఈ పరిణామాల నేపథ్యంలో వాజేను క్రైమ్‌ బ్రాంచ్‌ నుంచి బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.  ఫిబ్రవరి 25న ముకేశ్ అంబానీ నివాసమైన యాంటిలియా వద్ద జిలిటెన్‌ స్టిక్స్‌తో ఉన్న వాహనం నిలిపి ఉంచడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కారు యజమానిగా పేర్కొన్న మాన్సుఖ్ హిరేన్ కేసును ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఈ క్రమంలో హిరేన్ ఈ నెల 5న అనుమానాస్పద స్థితిలో థానేలో మృతి చెందారు. ఈ కేసులో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ అయిన సచిన్‌ వాజే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను క్రైమ్‌ బ్రాంచ్‌ నుంచి బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.