రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయం

రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయం
రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్లు టీఆర్ఎస్ ను వ్యతిరేకించారని స్పష్టం చేశారు. సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. రెండు రోజులుగా టీఆర్ఎస్ ఇస్టానుసారంగా పైసలు పంచిందని ఆరోపించారు. పోలీసులు చూస్తుండగానే డబ్బులు పంచారని ధ్వజమెత్తారు. అయితే కోట్లు పంచిపెట్టినా టీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారని తెలిపారు. ప్రేమందర్ రెడ్డిపై దాడికి ప్రయత్నించారని మండిపడ్డారు. 
 
పోలింగ్ స్టేషన్లలో కనీస సౌకర్యాలు లేక చాలా మంది తిరిగి వెళ్లిపోయారని సంజయ్ చెప్పారు. వెంటనే అరెస్ట్ చేసిన సంతోష్, నాగోజీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భైంసా అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం దారుణమని విమర్శించారు. టీఆర్ఎస్ నీచ రాజకీయాలు చేస్తోందని పేర్కొంటూ అత్యాచార ఘటనపై ఒక్క పార్టీ కూడా మాట్లాడలేదని విస్మయం వ్యక్తం చేశారు. విలేకరులపై దాడి చేస్తే కూడా మాట్లాడలేదని దుయ్యబట్టారు. భైంసాలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం నిర్వహించిన పోలింగ్‌ కు పట్టభద్రులు భారీగా కదిలిరావడంతో అంచనాలకు మించి రికార్డుస్థాయిలో ఓటింగ్‌ నమోదైంది. గ్రామీణ ప్రాంతాలతో పోటీగా పట్టణ పట్టభద్ర ఓటర్లు కదిలివచ్చారు. పలు కేంద్రాల వద్ద ఉదయం నుంచే రద్దీకనిపించింది.
 
వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గంలో 76.35%, మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ నియోజకవర్గంలో 72.45% పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. ఈ రెండు స్థానాలకు 2015లో జరిగిన ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్‌ గణనీయంగా పెరిగింది. మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ స్థానంలో గత ఎన్నికల్లో 37.72%, వరంగల్‌- ఖమ్మం- నల్లగొండలో 54.62% మాత్రమే పోలింగ్‌ జరిగింది.