బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డిపై దాడి

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ హోరాహోరీగా సాగింది. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.  అయితే మహబూబాబాద్ నెల్లుకుదురులోని ఓ ఫంక్షన్ హాలులో  టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నారని సమాచారం అందడంతో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి, ఆయన అనుచరులు టీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. 
ఈ క్రమంలో చోటు చేసుకున్న గందరగోళ, ఘర్షణ పరిస్థితుల్లో టీఆర్ఎస్ శ్రేణులు ఆయనపై దాడికి దిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పోలీసుల ముందే ఇటుకలతో టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారని చెప్పారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి ఛాతీ భాగంలో ఇటుకలు తగిలడంతో ఖమ్మం ప్రభుత్వ హాస్పత్రికి తరలించారు.
దాడిని  బీజేపీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడికి పాల్పడింది టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచరులేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.  

మరోవైపు, కొన్ని పోలింగ్ బూతుల్లో కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచుతుండడం కలకలం రేపుతోంది. గుట్టుగా డబ్బును పంచుతుండగా రహస్యంగా తీసిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటు వేయాలని ఆ పార్టీ కార్యకర్తలు బూత్‌లోకి వచ్చే పట్టభద్రులకు డబ్బులు పంచుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
భువనగిరి, సూర్యాపేట, దేవరకొండలో ఓటు వేయడానికి వస్తున్న గ్రాడ్యుయేట్‌లను ప్రలోభాలకు గురిచేస్తూ డబ్బులు పంచుతూ కార్యకర్తలు అడ్డంగా దొరికిపోయారు. తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పలు పోలింగ్‌ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. 

 రెండు నియోజకవర్గాల పరిధిలో 10 లక్షలకుపైగా ఓటర్లున్నారు. 1,530 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక, కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాట్లు చేశారు. మరి కొన్నిచోట్ల సూక్ష్మ పరిశీలకులను నియమించారు.