కోడ్ ఉల్లంఘించిన హోం మంత్రి మహమూద్ అలీ

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ను ఉప ముఖ్యమంత్రి,  హోంమంత్రి మహమూద్ అలీ ఉల్లంఘించారు.  మలక్ పేటలోని పోలింగ్ కేంద్రంలో ఓటేసిన అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ‘‘ఉదయం 8.45కి బూత్ నెంబర్ 588కి ఓటేసినా.. మా పార్టీ అభ్యర్థి సురభీ వాణీదేవికి ఓటేశాను..’’  అని చెప్పారు. ఓటు వేసిన విషయం రహస్యంగా ఉంచాలన్న నిబంధనను పట్టించుకోకుండా చేసిన కామెంట్స్ పై వివాదం చెలరేగింది.

సాక్షాత్తు హోం మంత్రి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడంపై దుమారం చెలరేపుతోంది. మలక్ పేట్ లో ఓటు వేసి బయటకు వచ్చిన  తర్వాత పోలింగ్ కేంద్రం బయట ఈ కామెంట్స్ మీడియాలో ప్రసారం కావడంతో సదరు క్లిప్పింగులతో ప్రతిపక్షాల నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేశారు. 

 
సాధారణంగా ఓటు వేసిన విషయం బహిరంగంగా చెప్పకూడదు. అయితే దీన్ని హోంమంత్రే ఉల్లంఘించడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. హోం మంత్రి దురుసుతనం దారుణమని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని, ఆయన వేసిన ఓటును చెల్లనిదిగా పరిగణించాలని ఫిర్యాదులు చేస్తున్నారు. 
 
కాగా, రాష్ట్రం లో ప్రజాస్వామ్యాన్ని  అపహాస్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇటు పట్టభద్రులకు పదివేలిచ్చి ప్రలోభాలకు గురిచేయడం .. అటు ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు ప్రయత్నం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. నిన్న రాత్రంతా మేధావుల్ని ప్రలోభ పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారని, ఒక్కో ఓటుకు రూ.10 వేలు ఇచ్చి పట్టభద్రులను ప్రలోభ పెట్టె ప్రయత్నం చేశారు… అలాగే ఉద్యోగుల్ని భయపెట్టే ప్రయత్నం జరిగిందని తెలిపారు. 
 
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఇస్తున్న వందల కోట్ల యాడ్స్ పై ఐటీ విచారణ జరపాలని పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. వీటికి ఎవరు డబ్బులు ఇస్తున్నరో వారిపై చర్యలు తీసుకోవాలన్నారుని కోరారు.