ఓటమి భయంతో తప్పుడు సర్వేల ప్రచారం 

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ జరగడానికి కొన్ని గంటల ముందు అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన సోషల్ మీడియా పెయిడ్ గ్రూపులు ‘వెలుగు’ దినపత్రిక సర్వే పేరుతో పోస్టులను ప్రచారంలో పెట్టాయి. అధికార పార్టీకి అనుకూలంగా చూపిస్తూ ఈ పోస్టులను లక్షల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లకు వాట్సాప్, ఇతర మార్గాల్లో పంపించాయి.

నిజానికి వి6 న్యూస్ చానెల్ గానీ, వెలుగు దినపత్రికగానీ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎలాంటి సర్వేలు చేయలేదు. అయినా ‘వెలుగు’ పేరుతో ప్రచారం చేయడం వెనుక ఓటర్లను తప్పుదోవ పట్టించే పెద్ద కుట్ర కనిపిస్తోంది. ఎందుకంటే ‘వెలుగు’ పేరుతో ఫేక్ సర్వేలను ప్రచారం చేయడం ఇదే మొదటిసారి కాదు. 

కొన్ని నెలల కింద గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు, అంతకన్నా ముందు దుబ్బాక బైపోల్ టైంలోనూ ఇలాంటి తప్పుడు సర్వేలను ప్రచారంలోకి తెచ్చారు. ప్రతిసారీ వి6 వెలుగు పేరునే ఫేక్ సర్వేలకు వాడుకోవడం వెనుక ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందే ఓటమి ఖరారైందన్న భయంతోనే ఇలాంటి కుతంత్రానికి దిగజారారు. విశ్వసనీయత ఉన్నవాళ్ల పేరుతో ప్రచారం చేస్తే ఓటర్లు నమ్మి నాలుగు ఓట్లేస్తారన్న దివాలాకోరుతనం కనిపిస్తుంది.

గులాబీ కీలక నేతకు సన్నిహితుడైన ఓ చోటా లీడర్ నాయకత్వంలో పదుల సంఖ్యలో పెయిడ్, ఫేక్ సోషల్ మీడియా గ్రూపులను నడిపిస్తున్నారనే ఆరోపణలు చెలరేగుతున్నాయి. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, సమస్యలపై పోస్టులుపెట్టే వారిపై బూతులతో, వ్యక్తిగత కామెంట్లతో దాడులు చేయడం వీళ్ల పని. ఇవన్నీ ఫేక్ అకౌంట్లేనని చాలా సందర్భాల్లో నిరూపణ అయ్యింది.

అవే ఫేక్ అకౌంట్లను నమ్ముకొని ఇప్పుడు తప్పుడు సర్వేలను ప్రచారం చేస్తున్నారు. వెలుగు పేరుతో ఎమ్మెల్సీ ఎన్నికల ఫేక్ సర్వే పోస్టులపై సైబర్ క్రైమ్ పోలీసులకు గతంలో కూడా ఫిర్యాదు చేసినా పేరుకు కేసులు రాసుకోవడం తప్పా ఏమీ పట్టించుకోవడం లేదు.