అరెస్ట్ వెనుక ఒవైసీ రాజకీయ కుట్ర

అరెస్ట్ వెనుక ఒవైసీ రాజకీయ కుట్ర

వ్యాపారంలో రాణించడంతో పాటు రాజకీయాల్లో మహిళా సాధికారత కోసం పోరాడుతున్నందుకు  మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తనపై కుట్ర పన్నారని, తన ఆస్తులను కాజేసేందుకు యత్నించారని హీరా గ్రూప్‌ సీఈవో నౌహీరాషేక్‌ ఆరోపించారు. నోటీసులు సైతం ఇవ్వకుండా తనను అరెస్టు చేసి 29 నెలలు జైల్లో ఉంచారని ఆరోపించారు. 

హీరా గ్రూప్‌లో ఎలాంటి కుంభకోణం జరగలేదని పేర్కొంటూ  డబ్బులు వెనక్కి కావాలనుకునేవారికి త్వరలోనే ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు. తనపై ఫిర్యాదు చేసిన 29 మందికి డీడీల రూపంలో చెల్లింపులు చేశామని వెల్లడించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి ఆమె విలేకరులతో మాట్లాడుతూ  1998లో హీరా గ్రూప్‌ను స్థాపించి అంచెలంచెలుగా పబ్లిక్‌ లిమిటెడ్‌ స్థాయికి ఎదిగామని చెప్పారు. 

1.72 లక్షల మంది డిపాజిటర్లలో కేవలం 29 మంది రూ.లక్ష, రూ.5 లక్షలు.. నష్టపోయామని ఫిర్యాదులు చేయగానే రూ.100 కోట్లకు పైగా పన్నులు చెల్లించే కంపెనీలను జప్తు చేయడం తగదని ఆమె  వాపోయారు.  సాఫీగా సాగుతున్న తన కంపెనీపై 2012లో అసదుద్దీన్‌ ఒవైసీ తనపై ఫిర్యాదు చేశారని.. నౌహీరా గుర్తుచేశారు.

దాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నానని.. దీంతో, 2018లో మరికొన్ని ఫిర్యాదులు చేసి జైలులో తోసేద్దామనే కుట్ర జరిగిందని ఆమె పేర్కొన్నారు. ‘‘ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న తర్వాత 2018 అక్టోబరులో.. మా పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీచేస్తుందని ప్రకటించాను. ఆ తర్వాత నాలుగు రోజులకే ఢిల్లీలో పోలీసులు నన్ను అరెస్టు చేశారు. దీంట్లో రాజకీయ కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది’’ అని ఆమె ఆరోపించారు.

కొంతమంది బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతూ రూ.20 కోట్లు, రూ.50 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్‌ మెయిలింగ్‌ చేశారని, ,పట్టించుకోక పోవడంతో కేసులు నమోదు చేశారని ఆమె ఆరోపించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పరిశీలిస్తే వారి వెనక ఎవరున్నారనే విషయాలు తెలుస్తాయని ఆమె చెప్పారు. తాను అరెస్టు కాగానే టోలీచౌకిలో హీరా గ్రూప్‌ పేరిట ఉన్న లక్ష గజాల స్థలాన్ని కబ్జా చేశారని నౌహీరా ఆరోపించారు.

తాను అరెస్టు అయిన వెంటనే తన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసినప్పటికీ.. ఆ స్థలాన్ని ఎవరో కబ్జా చేసి ఏడంతస్తుల భవనాన్ని నిర్మించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈడీ తన ఆధీనంలో ఉన్న స్థలాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతను విస్మరించిందని ఆమె విమర్శించారు.

తనపై.. తన కంపెనీలపై దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించామని నౌహీరా హెచ్చరించారు. 

హీరా బాధితుల సంఘం పేరిట చలామణి అయిన సంస్థపై కూడా కోర్టుకు వెళతామని ఆమె చెప్పారు. అసలు అలాంటి సంఘం పెట్టడానికి అర్హత ఏంటని ఆమె ప్రశ్నించారు. రూ. 50 వేల కోట్ల కుంభకోణం అని అసదుద్దీన్‌ లాంటి వ్యక్తి ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమని ఆమె కొట్టిపారవేసారు.