అభిషేక్ బెనర్జీ బంధువులకు సీబీఐ సమన్లు 

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని అవినీతి కేసులు మరింత చుట్టుముడుతున్నాయి. తాజాగా బొగ్గు కుంభకోణం కేసులో ఆ పార్టీ ఎంపీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ బంధువులకు సీబీఐ అధికారులు సమన్లు జారీ చేశారు. 

అభిషేక్ బెనర్జీ మరదలు మేనక గంభీర్ భర్త అంకుశ్ అరోరా, ఆయన తండ్రి పవన్ అరోరాలను ఈ నెల 15న విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ ఆదేశించింది. ఇదే కేసులో ఇటీవల బెనర్జీ సతీమణి రుజిరా, మరదలు మేనక గంభీర్‌లను సీబీఐ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.

కాగా, శారద కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సమీర్ చక్రవర్తి, ప్రముఖ ఆర్టిస్ట్ సువప్రసన్నలకు నిన్న ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 27 నుంచి మొత్తం 8 దశల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఇక్కడ 2011, 2016 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించింది. 

అయితే ఈసారి ఎలాగైనా ఇక్కడ బీజేపీ జెండా ఎగురవేయాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇరుపార్టీల నేతలు పరస్పరం విమర్శలు, ప్రతివిమర్శలకు దిగుతుండడంతో మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది.