ఆరు దేశాల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ నిలిపివేత

రక్తం గడ్డకడుతున్నదన్న భయం కారణంగా ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 వ్యాక్సిన్ ఇవ్వడాన్ని ఆరు దేశాలు నిలిపివేశాయి. ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న కొంతమంది తమ శరీరంలో రక్తం గడ్డకట్టిన ఆనవాళ్లు ఉన్నాయని ఫిర్యాదు చేయడంతో తాజాగా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డానిష్ ఆరోగ్య అధికారులు తెలిపారు.

ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టినట్లు నివేదికలు వచ్చినట్లు డానిష్ హెల్త్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. కానీ ఇది టీకా తీసుకోవడం వల్లనే జరిగి ఉండొచ్చన్న ఆధారాలేవీ లేవని పేర్కొన్నారు. 

యాంటీ-కోవిడ్ డోసు అందుకున్న 49 రోజుల తర్వాత ఒక నర్సు ‘తీవ్రమైన రక్తం గడ్డకట్టిన సమస్యతో’ మరణించిన తరువాత ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల వాడకాన్ని నిలిపివేసినట్లు ఆస్ట్రియా సోమవారం ప్రకటించింది. మరో నాలుగు యూరోపియన్ దేశాలైన ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్ కూడా తదుపరి బ్యాచ్ నుంచి వ్యాక్సిన్ల వాడకాన్ని నిలిపివేశాయి.

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ 17 యూరోపియన్ దేశాలకు మిలియన్‌ డోసులకు పైగా పంపిణీ జరిగింది. డెన్మార్క్ ఈ వ్యాక్సిన్లను ఇవ్వడాన్ని గురువారం నిలిపివేసింది. బుధవారం, యూరప్ యొక్క ఔషధాల వాచ్‌డాగ్ ఈఎంఏ.. ఆస్ట్రియాలో ఉపయోగించిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల బ్యాచ్ నర్సు మరణానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెల్లడించింది. 

మార్చి 9 నాటికి యూరోపియన్ ఎకనామిక్ ఏరియాలో మూడు మిలియన్ల మందికి పైగా టీకాలు వేసిన వారిలో 22 రక్తం గడ్డకట్టినట్లు కేసులు వచ్చాయని ఈఎంఏ తెలిపింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వాడకాన్ని రద్దు చేయలేదని, కొన్నిరోజులపాటు ఈ వ్యాక్సిన్ వాడకాన్ని నిలిపివేస్తున్నట్లు డానిష్ హెల్త్ అథారిటీ డైరెక్టర్ సోరెన్ బ్రోస్ట్రోమ్ ఒక ప్రకటనలో తెలిపారు. 

వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఇప్పటివరకు ఒకరు మరణించారని డెన్మార్క్ స్పష్టం చేసింది. ఈ మరణంపై ఈఎంఏ దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పుడు మొత్తం వయోజనులకు జూలై ఆరంభానికి బదులుగా ఆగస్టు మధ్య నాటికి టీకాలు వేయాలని ఆశిస్తున్నట్లు ఆరోగ్య అధికారులు పేర్కొంటున్నారు.