మమతపై దాడి జరగనే లేదు… కేవలం ప్రమాదమే!

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ గాయ‌ప‌డిన ఘ‌ట‌న‌పై స్థానిక పోలీసులు ప్రాథ‌మిక విచార‌ణ పూర్తి చేశారు. ఇది దాడి కాదు.. ప్ర‌మాద‌మే అయి ఉండే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పోలీసులు వెల్ల‌డించారు. ఎన్నిక‌ల సంఘానికి ఈ మేర‌కు ప్రాథ‌మిక విచార‌ణ‌కు సంబంధించిన రిపోర్ట్ అందించారు. 
 
విచార‌ణ బృందం ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతంలో సాక్ష్యాధారాలు సేక‌రించ‌డంతోపాటు ప్ర‌త్య‌క్ష సాక్షుల‌ను విచారించే ప‌నిలో ఉంది. అయితే సీఎం భ‌ద్ర‌త వ్య‌వ‌హారంపై సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మమ‌త‌ను క‌ల‌వ‌డానికి వ‌చ్చిన ప్ర‌జ‌ల‌ను స‌రిగా హ్యాండిల్ చేయ‌లేక‌పోయార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 
త‌న‌ను ఎవ‌రో కావాల‌నే తోసేశార‌ని, ఇది బీజేపీ కుట్ర అని ఆమె ఆరోపించారు. ఈ ఘ‌ట‌న‌తో ఆమె ఎడ‌మ కాలు విరిగింది. అయితే ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు అక్క‌డే ఉన్న ప్ర‌త్య‌క్ష సాక్షుల క‌థ‌నం మాత్రం మ‌రోలా ఉంది.

నిమై మైతి అనే వ్యక్తికి ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే స్వీట్‌ షాప్‌ ఉంది. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘ఈ ఘటన నా షాప్‌ ఎదురుగానే జరిగింది. సాయంత్రం 6.15 గంటలకు మమతా బెనర్జీ ఒక ఆలయం నుంచి మరొక ఆలయానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన ఒక యూటర్న్‌ దగ్గర సంఘటన జరిగిందని చెప్పారు. 

మమత వాహనంలో నుంచి కొద్దిగా బయటకు వచ్చి.. జనాలకు అభివాదం తెలుపుతున్నారు. ఈ క్రమంలో దీదీని చూడటానికి జనాలు ఒక్కసారిగా పరిగెత్తుకురావడంతో.. కారు డోరు ఆమె కాలికి తగిలి గాయం అయ్యింది. అంతే తప్ప.. ఆమె మీద ఎవరు దాడి చేయలేదని స్పష్టం చేశారు.  

ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో వాళ్లు మాట్లాడుతూ మ‌మ‌తను ఎవ‌రూ తోయ‌లేద‌ని, ఆమెను చూడ‌టానికి భారీగా జ‌నం వ‌చ్చార‌ని సౌమెన్ మైతీ అనే విద్యార్థి చెప్పాడు. తాను ఏ రాజ‌కీయ పార్టీకి చెందిన‌వాడిని కాద‌ని కూడా అత‌డు చెప్పాడు.
మ‌రో ప్ర‌త్య‌క్ష సాక్షి చిత్త‌రంజ‌న్ దాస్ అనే వ్య‌క్తి కూడా ఇదే మాట చెప్ప‌డం గ‌మ‌నార్హం. కారు వెళ్తున్న స‌మ‌యంలో ఆమె సీట్లో కూర్చున్నారు. అయితే డోర్ మాత్రం తెరిచే ఉంది. ఆ త‌ర్వాత ఆ డోర్ పోస్ట‌ర్‌కు త‌గ‌లడంతో అది మూసుకుపోయింది. అంతే త‌ప్ప మ‌మ‌త‌ను ఎవ‌రూ తోయ‌లేదు, ఆమెపై చేయి చేసుకోలేదు అని చిత్త‌రంజ‌న్ దాస్ స్ప‌ష్టం చేశాడు. తాను ఏ రాజ‌కీయ పార్టీకి చెందిన వాడిని కాద‌ని  కూడాచెప్పాడు.
‘‘ఈ సంఘటన జరిగినప్పుడు స్థానిక పోలీసులు, మమత బాడీగార్డులు అక్కడే ఉన్నారు…’’ స్థానికుడొకరు పేర్కొన్నారు. కాగా, రెండు, మూడు రోజుల్లో మళ్లీ ప్రచారంలో పాల్గొంటానని బెంగాల్ సిఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. నిన్న జరిగిన దాడిలో చాతి, తలపై గాయాలయ్యాయని ఆమె చెప్పారు. వీల్‌చైర్ సాయంతో ప్రచారం చేస్తానని మమత చెప్పారు. టిఎంసి కార్యకర్తలు సంయమనం పాటించి, ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడొద్దని దీదీ కోరారు.