మమతను కలిసే ప్రయత్నం చేసిన బీజేపీ నేతలు 

దాడిలో కాలికి గాయమైన పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని కలిసేందుకు ఆ రాష్ట్ర బీజేపీ నేతలు గురువారం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. బీజేపీ రాష్ట్ర ముఖ్య ప్రతినిధి షామిక్ భట్టాచార్య, సీనియర్ నాయకుడు తథాగ్తా రాయ్ కోల్‌కతాలోని ప్రభుత్వ ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మమతను కలవడానికి ప్రయత్నించారు. 

అయితే మమతను చూడటానికి వైద్యులు వారిని అనుమతించలేదు. దీనిపై బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మేము మానవతావాదంతో ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చాము. అయితే వైద్యులు మాకు అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి అరుప్ బిస్వాస్‌ను కలిశాం. మమతపై జరిగిన దాడిపై ఆందోళన వ్యక్తం చేశాం’ అని తెలిపారు. 

`ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకున్నాం. మా సందేశాన్ని సీఎం మమతకు తెలియజేయాలని బిస్వాస్‌కు చెప్పాం’ అని రాయ్ పేర్కొన్నారు. మరోవైపు ఆసుపత్రి బయట ఉన్న టీఎంసీ కార్యకర్తలు బీజేపీ నేతలు వెనక్కి వెళ్లాలంటూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

మరోవైపు త‌న‌ను న‌లుగురు, ఐదుగురు క‌లిసి తోసేశార‌ని మమతా  ఆరోపిస్తుండ‌గా, ఎన్నిక‌ల ముందు డ్రామా అని బీజేపీ కౌంట‌ర్ ఇస్తోంది. ఇప్పుడీ ఇద్ద‌రూ ఎన్నిక‌ల సంఘానికి ఒక‌రిపై మ‌రొక‌రు ఫిర్యాదులు చేసుకుంటూ లేఖ‌లు పంపించారు. త‌మ పార్టీ చీఫ్‌ను హ‌త్య చేయ‌డానికి జ‌రిగిన కుట్ర ఇది అని తృణ‌మూల్ ఆరోపించ‌గా.. అవ‌న్నీ అబద్ధాల‌ని, ఆ ఫుటేజీ చూపించాల‌ని బీజేపీ డిమాండ్ చేస్తోంది. 

ప‌శ్చిమ బెంగాల్ డీజీపీని తొల‌గించిన 24 గంట‌ల్లోపే మ‌మ‌తా బెన‌ర్జీపై హ‌త్యాయ‌త్నం చేశార‌ని తృణ‌మూల్ త‌న లేఖ‌లో ఆరోపించింది. రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించ‌కుండానే ఎన్నిక‌ల సంఘం డీజీపీని తొల‌గించింద‌ని టీఎంసీ చెబుతోంది. డీజీపీని తొల‌గించ‌డం, ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు అక్క‌డ పోలీసులు లేక‌పోవ‌డంపై తృణ‌మూల్ ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతోంది. కొంద‌రు సంఘ విద్రోహ శ‌క్తుల‌ను నందిగ్రామ్‌కు త‌ర‌లించిన‌ట్లు త‌మ‌కు స‌మాచారం ఉంద‌ని ఆ పార్టీ చెబుతోంది.

అయితే బీజేపీ మాత్రం ఈ ఆరోప‌ణ‌ల‌ను చాలా సీరియ‌స్‌గా తీసుకుంది. ఓ ముఖ్య‌మంత్రి భ‌ద్ర‌త‌కు సంబంధించిన విష‌యంలో ఈ ఆరోప‌ణ‌లు ఏంట‌ని ప్రశ్నిస్తోంది. సీఎం ప‌ర్య‌ట‌న‌లో భ‌ద్ర‌తా సిబ్బంది, వేలాది మంది పోలీసులు ఉన్నా ఇది ఎలా జ‌రుగుతుంద‌ని ప్ర‌శ్నించింది.  దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేసింది. అంతేకాదు ఆ స‌మ‌యంలోని వీడియో ఫుటేజీని బ‌య‌ట‌పెడితే అస‌లు సంగ‌తేంటో తెలుస్తుంద‌ని బీజేపీ స్ప‌ష్టం చేసింది.