నందిగ్రామ్‌లో మమతాపై దాడి

నందిగ్రామ్‌ పర్యటనలో తనపై దాడి జరిగిందని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. నందిగ్రామ్‌ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు బుధవారం ఆమె నామినేషన్‌ వేశారు.  అనంతరం, వెనక్కు వెళ్తుండగా, తనపై నలుగురైదుగురు దాడి చేశారని, తనను నెట్టివేయడంతో ఎడమ కాలికి గాయమైందని మమత వివరించారు. సాయంత్రం 6.15 గంటల సమయంలో రేయపరా వద్ద ఈ ఘటన జరిగిందని తెలిపారు.

‘నా కారు వెలుపల నిల్చుని ఉన్నా. కారు డోర్‌ తెరచి ఉంది. అక్కడి నుంచి కనిపిస్తున్న గుడివైపు చూస్తూ ప్రార్ధించాను. ఆ తరువాత కార్లోకి వెళ్దామనుకుంటుండగా, అకస్మాత్తుగా నలుగురైదుగురు నా దగ్గరకు వచ్చి, కారు డోర్‌ను నా వైపు గట్టిగా నెట్టారు. ఆ డోర్‌ తగిలి నా ఎడమ కాలికి గాయమైంది. నేను ఒక్కసారిగా ముందుకు పడిపోయాను’ అని వివరించారు.

గాయంతో కాలు వాచిందని, జ్వరంగా అనిపిస్తోందని, ఛాతీలో నొప్పిగా ఉందని ఆమె తెలిపారు. ‘కావాలనే కొందరు ఈ దాడికి పాల్పడ్డారు. ఇది కుట్ర. ఎస్పీ సహా స్థానిక పోలీసులెవరూ ఆ సమయంలో నా దగ్గర లేరు’ అని ఆమె  ఆరోపించారు. ఈ ఘటన జరిగిన వెంటనే వ్యక్తిగత భద్రత సిబ్బంది మమతను కారులో వెనుక సీటులో కూర్చోబెట్టారు.

బుధవారం రాత్రి నందిగ్రామ్‌లోనే ఉండాలనుకున్న ఆమె ఈ ఘటన జరగడంతో  కోల్‌కతా వెళ్లి  ప్రభుత్వ ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రిలో చికిత్స పాండారు. చికిత్స  కోసం ప్రభుత్వం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది. మమతని స్ట్రెచర్‌పై ఆసుపత్రిలోకి తీసుకువెళ్తున్న సమయంలో భారీగా చేరుకున్న టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీ వ్యతిరేక  నినాదాలు చేశారు. కాలికి ఎక్స్‌రే తీస్తామని, గాయం తీవ్రతను బట్టి చికిత్స ఉంటుందని వైద్యులు తెలిపారు.

మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ, పలువురు రాష్ట్ర మంత్రులు ఆసుపత్రికి వెళ్లారు. రెండు రోజులుగా మమత నందిగ్రామ్‌లోనే ఉన్నారు. తమ పార్టీ అధినేత్రిని ఎన్నికల ప్రచారం నుంచి తప్పించే లక్ష్యంతో కొందరు ఈ దాడికి పాల్పడ్డారని టీఎంసీ ఆరోపించింది.

మరోవైపు, మమతపై దాడిపై బీజేపీ స్పందిస్తూ చిన్న ప్రమాదాన్ని పెద్ద కుట్రగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. దీనిపై సీబీఐ  దర్యాప్తు జరపాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయ్‌వర్ఘియ డిమాండ్‌ చేశారు. ఇలాంటి ప్రచారాలతో సానుభూతి పొందాలనే ప్రయత్నాలు ఫలించబోవని కాంగ్రెస్‌ నేత ఆధిర్‌ రంజన్‌ చౌధురి  స్పష్టం  చేశారు. ‘రాష్ట్ర హోం మంత్రి కూడా ఆమెనే. అందువల్ల ఈ వైఫల్యానికి బాధ్యతగా ఆమె రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.

ఇలా ఉండగా, ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి మమతను గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ పరామర్శించారు. ఆయన ఆసుపత్రిలోకి వెళ్తుండగా, ‘గో బ్యాక్‌’ అంటూ టీఎంసీ కార్యకర్తలు నినాదాలు చేశారు. మరోవైపు, సీఎంపై దాడి ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని రాష్ట్ర పోలీసులను ఈసీ ఆదేశించింది.  స్పెషల్‌ పోలీస్‌ అబ్జర్వర్‌ వివేక్‌దూబే, స్పెషల్‌ జనరల్‌ అబ్జర్వర్‌ అజయ్‌నాయక్‌ కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.