మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ 

 మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. మచిలీపట్నంలోని ఆయన నివాసం వద్ద పోలీసులు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు.  ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులపై నిన్న దురుసుగా ప్రవర్తించారంటూ రవీంద్రపై కేసు నమోదు చేశారు. ఆయనను ఇనుకుదురు పీఎస్‌కు పోలీసులు తరలించారు. కొల్లు రవీంద్రపై 506, 341, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కొల్లు రవీంద్ర బుధవారం పోలింగ్‌ సెంటర్‌ వద్ద వీరంగం సృష్టించి,  ఓటింగ్‌ ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పాటు, తనను పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లకుండా అడ్డుకున్నందుకు ఏకంగా విధుల్లో ఉన్న ఎస్‌ఐపై చేయి చేసుకున్నారుని కేసు నమోదయింది.

మచిలిపట్నం 25వ డివిజన్‌ సర్కిల్‌పేటలోని పోలింగ్‌ కేంద్రానికి టీడీపీ నేత కొల్లు రవీంద్ర, మరి కొందరి కార్యకర్తలతో కలిసి వచ్చారు. తాను లోపలికి వెళ్లి పోలింగ్‌ సరళిని పరిశీలించాలంటూ హాడావుడి చేసే ప్రయత్నం చేశారు. దాంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు 144 సెక్షన్‌ అమల్లో ఉందని..  ఆయన లోపలికి వెళ్లడానికి కుదరదని కొల్లు రవీంద్రకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.  ఈ క్రమంలో కొల్లు రవీంద్ర.. పోలీసులపై విరుచుకుపడ్డాడని పోలీసులు పేర్కొంటున్నారు.

ఉదయాన్నే కొల్లును అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి పోలీసులు చేరకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రవీంద్రను అరెస్ట్ చేయవద్దంటూ  పోలీసులను కార్యకర్తలు, అభిమానులు అడ్డుకున్నారు. రవీంద్రను పోలీసు వాహనం ఎక్కనీయకుండా అడ్డుపడ్డారు. దీంతో పోలీసులు వారిని పక్కకు తొలగించేందుకు యత్నించగా కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. 

చివరకు కార్యకర్తలను అడ్డుతొలగించిన పోలీసులు కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.  నిన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ పాల్పడిన అక్రమాలను అడ్డుకున్నందునే రవీంద్రను అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు.