నెల్లూరులో ఆచార్య ఆదిత్య మృతి 

ఆచార్య ఆదిత్యగా పేరొందిన వరిష్ట ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త బాలినేని రామిరెడ్డి (74) సోమవారం సాయంత్రం నెల్లూరులోని జయభారత్ ఆసుపత్రిలో మృతి చెందారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. 
 
ప్రకాశం జిల్లాకు చెందిన ఆయన అత్యవసర పరిస్థితి సమయంలో చిత్తూర్ జిల్లా  ప్రచారక్ గా తిరుపతి కేంద్రంగా పనిచేశారు. ప్రకాశం జిల్లాలోనూ కూడా ప్రచారక్ గా పనిచేశారు. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా జరిగిన సత్యాగ్రహ ఉద్యమంను పర్యవేక్షిస్తున్న సమయంలో ఆయన అంతర్గత భద్రత నిర్వహణ చట్టం (మిసా) క్రింద అరెస్ట్ అయి సికింద్రాబాద్ జైలులో ఉన్నారు.
అత్యవసర పరిస్థితి అనంతరం 1978లో నెల్లూరుకు మకాం మార్చారు. సంవత్సరం పాటు గణితశాస్త్రంను అధ్యనం చేసి ఆదిత్య కోచింగ్ కేంద్రం ఏర్పాటు చేసి అప్పటి నుండి ఆచార్య ఆదిత్యగా ప్రసిద్ధి చెందారు. అనేక సామజిక, సాంస్కృతిక,  సాహిత్య  కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఉండేవారు. 

చర్చలలోనూ చాలా చురుకుగా ఉండేవారు. వివిధ పార్టీల, సంస్థల సిద్ధాంతాలను ఆకళించుకోవటం లోనూ, తనదైన సంఘ సిద్ధాంతాన్ని ప్రతిపాదించటం లోనూ ఆయనకు గల చురుకుదనం అందరినీ ఆకర్షించేది.  ప్రజ్ఞ, చురుకుదనం ఉన్న విద్యార్థులను గుర్తించి, ప్రోత్సాహించటంలో ఆయనది అందెవేసినచేయి. 
 
దత్తోపంత్ తెంగేది ప్రభావం సైద్ధాంతికంగా ఆయనలో ఎక్కువగా ఉండెడిది. భావోద్రేకాలలో యాదవరావ్ జోషీ వలే కవ్వించి మాట్లాడించే వారు. తన అభిప్రాయాలను, ఆలోచనలను ఎటువంటి మొహమాటం లేకుండా నిక్కచ్చిగా వ్యక్తం చేస్తూ ఉండేవారు. ఆయనలోని ఈ గుణం ఎందరో విద్యార్థులను స్పర్ధలలో ముందునిలిపి ప్రపంచంలోకి దూసుకు పోయేటట్లుచేసింది.