`ఆంధ్రజ్యోతి’ కధనాల వెనుక చంద్రబాబు హస్తం 

టీటీడీకి సంబంధించి ఆంధ్రజ్యోతిలో వచ్చిన తప్పుడు కథనాల వెనక చంద్రబాబు హస్తం ఉందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. సొంత లాభం కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడం సరికాదని పేర్కొంటూ  ఆంధ్రజ్యోతిలో వచ్చిన తప్పుడు వార్తలు తనను తీవ్రంగా కలిచివేశాయని చెప్పారు. 

టీటీడీ పరువుకు భంగం కలించేలా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న ఆంధ్రజ్యోతిపై రూ. 100 కోట్లు పరువు నష్టం దావా వేసినట్లు తెలిపారు. తిరుపతిని సందర్శించిన సుబ్రహ్మణ్యస్వామి, టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై కోర్టులో బుధవారం పిటిషన్‌ దాఖలు చేశారు.

ఆయన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఆయనను సాదరంగా ఆహ్వానించి, శాలువతో సత్కరించి జ్ఞాపికను అందించారు. ఇరువురి మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది.

భేటీ అనంతరం సుబ్రహ్మణ్యస్వామి మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ లావాదేవీలను కాగ్‌ ద్వారా ఆడిట్‌ చేయించేందుకు సీఎం జగన్‌ అంగీకరించారని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో మంచి సంబంధాలు ఉండేవని గుర్తు చేశారు. 

కాగా, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని స్వామి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సీఎం జగన్‌ చర్చలు జరుపుతారని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రధానికి సీఎం జగన్ రెండు సార్లు లేఖ రాశారని గుర్తుచేశారు. అఖిల పక్షం, కార్మిక నేతలతో కలుస్తానని సీఎం చెప్పారని పేర్కొన్నారు.