అనపర్తి మాజీ ఎమ్మెల్యే అరెస్ట్‌

 తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు స్వగ్రామం రామవరంలో అరెస్ట్‌ చేశారు. ఓ హత్య కేసులో నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈసందర్భంగా గ్రామంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులను భారీగా మోహరించారు. నేరుగా హైకోర్ట్‌ లాయర్‌ శివారెడ్డి ఇంటి నుండి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.
 
 రెండు నెలల కిత్రం నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి బావ వరుస అయిన సత్తిరాజు రెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ హత్య కేసులో రామకృష్ణారెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తూ సత్తిరాజురెడ్డి సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో పోలీసులు విచారణ జరిపి రామకృష్ణారెడ్డిని అరెస్ట్‌ చేశారు. 

అయితే రాజకీయ కారణాలతోనే అరెస్టు చేశారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొద్ది రోజుల క్రితం రామకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రామకృష్ణారెడ్డి బిక్కవోలు ఆలయంలో ప్రమాణానికి సవాల్ చేశారు. 

రెండు వర్గాలు ఆలయంలో ప్రమాణం చేశాయి. ఆ తర్వాత కూడా రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో రామకృష్ణారెడ్డి బావ హత్య అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.