కొనేవాళ్లు రాకుంటే ఉక్కు పరిశ్రమలను మూసివేస్తాం

దేశంలో ప్రైవేటీకరించాలనుకున్న ఉక్కు ఫ్యాక్టరీలను కొనడానికి ఎవరూ ముందుకు రాకుంటే వాటిని తప్పనిసరిగా మూసివేస్తామని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం రాజ్యసభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు. ఐదేళ్లలో ఐదు ఉక్కు పరిశ్రమల ప్రైవేటీకరణకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఇఎ) అనుమతి ఇచ్చిందని ఆయన వివరించారు. 

ఉక్కు తయారీ రంగం నాన్ స్ట్రాటజిక్ పరిధి లోకి వస్తుందని ఈ విభాగం లోకి వచ్చే ప్రభుత్వ రంగ వాణిజ్య పరిశ్రమలను సాధ్యమైనంతవరకు పైవేటీకరిస్తామని లేనిపక్షంలో వాటిని మూసివేస్తామని స్పష్టం చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ కోసం 2021 పిబ్రవరి 4న ప్రభుత్వ రంగ సంస్థల విధానాన్ని కేంద్రం ప్రవేశ పెట్టిందని, ఆమేరకు ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకులు, బీమా సంస్థలకు ఇది వర్తిస్తుందని మంత్రి పేర్కొన్నారు. 

ఈ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఆ రంగం లోని పరిణామాలు, పరిపాలనా సాధ్యాసాధ్యాలు, పెట్టుబడిదారుల ఆసక్తిపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఉక్కు కర్మాగారాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాజ్యసభలో బిజెపి ఎంపి సస్మిత్ పాత్ర అడిగిన ప్రశ్నకు మంత్రి పై విధంగా వివరాలు తెలియచేశారు.

ఇలా ఉండగా, గత ఆరేళ్ల తమ పాలనా కాలంలో దేశంలోని పెట్టుబడిదారులకు రూ.6 లక్షల కోట్లకు పైగా కార్పొరేట్‌ పన్ను రాయితీలు ఇచ్చినట్లు కేంద్రం  పార్లమెంట్‌లో వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో సిపిఎం ఎంపి కెకె.రాగేష్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

ఆదాయ పన్ను చట్టం-1961 ప్రకారమే ఈ మినహాయింపులు, ప్రోత్సాహకాలు, వివిధ తగ్గింపులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని పేర్కొన్నారు. ఈ చర్యలు ఆర్థిక ఇబ్బందుల్లోని కంపెనీలకు ఊతం ఇచ్చేందుకు ఉపయోగపడుతాయని చెప్పుకొచ్చారు.