‘విశాఖ ఉక్కు’పై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ అంశంపై విన్నవించుకునేందుకు అవకాశమిస్తే అఖిలపక్షంతో ఢిల్లీకి వచ్చి కలుస్తామన్నారు. కాదంటే ఏకాంతంగానైనా కలసి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయొద్దంటూ విజ్ఞప్తి చేస్తామని ఆ లేఖలో తెలిపారు.
స్టీల్ ప్లాంటు పై ఆధారపడి 20 వేల కుటుంబాలు జీవిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రైవేటుపరం చేయొద్దని కోరుతూ గతంలో రాసిన లేఖలోని అంశాలను పునరుద్ఘాటిస్తూ.. మంగళవారం మోదీకి జగన్ మరో లేఖ రాశారు.
2002 నుంచి 2015 వరకూ విశాఖ ఉక్కు అత్యున్నత సామర్థ్యంతో లాభాలు ఆర్జించిందంటూనే, 2002 తర్వాత దివాలా తీసిందని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంగా పేరుగాంచిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్)కు చెందిన 7వేల ఎకరాలను ప్లాట్లుగా విభజించి అమ్మితే ఆదాయం వస్తుందని జగన్ సూచించారు.
కేంద్రం సహకరిస్తే కర్మాగారం లాభాల బాట పడుతుందని తెలిపారు. దీనిని ప్రైవేటుపరం చేయొద్దంటూ గత నెల 6న తాను లేఖ రాశానని గుర్తుచేశారు. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వక సమాధానమిస్తూ.. విశాఖ ఆర్‌ఐఎన్‌ఎల్‌లో కేంద్ర పెట్టుబడులన్నింటినీ ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించారని జగన్ పేర్కొన్నారు.
దాంతో బంధం ముడిపడిన కుటుంబాలనూ, రాష్ట్ర ప్రజలనూ బాధించిందని, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్.. విశాఖ ఉక్కుగా రాష్ట్ర ప్రజల్లో సెంటిమెంటు గూడుకట్టుకుని ఉందని జగన్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌గా గుండెల్లో ముద్ర పడిందని చెబుతూ ఈ సంస్థపై ఆధారపడి ప్రత్యక్షంగా 20 వేల మంది ఉద్యోగులు, పరోక్షంగా లక్షలాది మంది జీవిస్తున్నారని వివరించారు.
రూ.లక్ష కోట్ల విలువైన 19,700 ఎకరాలను స్టీల్ ప్లాంట్ కలిగి ఉందని పేర్కొంటూ 7 వేల ఎకరాలను ప్లాట్లుగా విభజించి అమ్మితే ఆదాయం వస్తుందని జగన్ సూచించారు. నిరంతర ఉత్పత్తితో ఆదాయం పెరుగుతుందని, సొంత ఇనుప ఖనిజం గనులుంటే ఉత్పత్తి వ్యయం బాగా తగ్గుతుందని జగన్ చెప్పారు.
ప్రధాని మోదీ సమర్థ నాయకత్వంలో కలసి పనిచేసేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతూ వీలైనంత త్వరగా అవకాశమిస్తే.. అఖిలపక్షంతోనూ, కార్మిక సంఘాలతోనూ కలసి వచ్చి స్టీల్ ప్లాంట్‌ను యథాతథంగా కొనసాగించాలని అభ్యర్థిస్తామని జగన్ తన లేఖలో తెలిపారు.
More Stories
తిరుమల శ్రీవారి పరకామణి బంగారం చోరీకి యత్నం
పోలవరం పనులపై పార్లమెంటరీ కమిటీ అధ్యయనం
చివరకు తొక్కిసలాటపై క్షమాపణ చెప్పిన టిటిడి చైర్మన్