అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు రాజధాని మహిళలపై పోలీసులు దమనకాండ సాగించారు. దుర్గగుడికి వెళ్తామని చెబుతున్నప్పటికీ మహిళలను ముళ్లకంచెలు, బారికేడ్లు వేసి అడ్డుకున్నారు. వాటిని తప్పించుకొని వెళ్లిన కొందరిని ప్రకాశం బ్యారేజీపై అరెస్టు చేశారు.
ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఇద్దరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. అక్కడ నుండి వారిని మంగళగిరి పోలీసు స్టేషన్‌కు తరలించారు. పలు గ్రామాల నుండి మందడం చేరుకున్న రైతులు శిబిరం నుండి విజయవాడకు బయలుదేరగా వెళ్లేందుకు వీలులేదని పోలీసులు నిలువరించడంతో వెలగపూడి దీక్షాశిబిరం వద్దకు ప్రదర్శనగా బయలుదేరారు.
వారిని మల్కాపురం జంక్షన్లో మరోసారి పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో ముళ్ల కంచెను తొలగించి, బారేకేడ్లను నెట్టేసి ముందుకెళ్లేందుకు మహిళలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు బలవంతంగా వారిని నెట్టేసి, కొంతమందిని అరెస్టు చేశారు. తుళ్లూరుకు చెందిన కంభంపాటి శిరీషపై బారికేడ్ పడటంతో సొమ్మసిల్లి పడిపోయారు. జొన్నలగడ్డ సుభాషిణి చేతికి గాయాలయ్యాయి.
తోపులాటలో పలువురు మహిళలు పడిపోయారు. అయినా పోలీసులు వారందరినీ బలవంతంగా వ్యానులో ఎక్కించే ప్రయత్నం చేయగా మహిళలు అడ్డుకున్నారు. ఈ సమయంలో మహిళా జెఎసి నాయకులు రాయపాటి శైలజ దుస్తులు చిరిగాయి. పలువురు మహిళలు గాయపడ్డారు.
రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్‌ను మళ్లించారు. సెక్రటేరియట్‌కు వెళ్లే దారిని మూసేశారు. పోలీసుల తీరుకు నిరసనగా రైతులు రోడ్డుపై బైఠాయించారు. భూములిచ్చినందుకు మహిళా దినోత్సవం రోజే ప్రభుత్వం తమకు మంచి బహుమతి ఇచ్చిందంటూ సుమారు 50 మంది మహిళలు గాయపడ్డ చేతులను ప్రదర్శించారు.
2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెలగపూడి శిబిరం దాక నడుచుకుంటూ మహిళలు, రైతుల ముందు వెళుతుంటే, వెనుకనుంచి పోలీసులు వెంబడించారు. సాయత్రం ఐదు గంటల సమయంలో వెలగపూడి శిబిరానికి వారంతా చేరుకున్నారు.
పోలీసులు బూటుకాళ్లతో తన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కృష్ణాజిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ గద్దె అనూరాధ, సినీనటి దివ్యవాణి సంఘీభావం తెలిపారు.
More Stories
సినీ నటి జేత్వాని వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు
ఏడాదిలోగా గన్నవరంలో ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్
కాదంబరీ జత్వానీ కేసులో ఏసీపీ, సీఐ సస్పెండ్