విశ్వాస తీర్మానం నెగ్గిన ఖట్టర్‌ సర్కార్‌

మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వంపై అసెంబ్లీలో విపక్షాలు చేపట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనను పాలక ప్రభుత్వం అణిచివేస్తోందని ఆరోపిస్తూ విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. 

సభలో ప్రశ్నోత్తరాల సమయం పూర్తయిన అనంతరం, మంత్రిమండలిపై అవిశ్వాస తీర్మానం నోటీసును చేపడుతున్నట్టు స్పీకర్ ప్రకటించారు.రైతు నిరసనల్లో వందలాది అన్నదాతలు నేలకొరుగుతున్నా ఖట్టర్‌ సర్కార్‌ చోద్యం చూస్తోందని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ మాజీ సీఎం, విపక్ష నేత భూపీందర్‌ సింగ్‌ హుడా అరోపించారు.

రాష్ట్ర సరిహద్దుల్లో 250 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని వారి పేర్లను తాను అందించినా అవి వార్తా పత్రికల్లో కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తన ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడాన్ని హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ తప్పుపట్టారు.

అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకూ ఒకసారి తన సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం కాంగ్రెస్‌ పార్టీకి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.  భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌పైనా కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు.

అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు కాంగ్రెస్‌కు ధన్యవాదాలని, వారి అధికార దాహం బయటపడుతోందని అంటూ ఇతరులు చెప్పిన విషయాలు వారికి నచ్చకపోతే ఏకంగా అవిశ్వాసానికే దిగుతారని తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్‌లో పార్టీ అంతర్గతంగా కూడా కొందరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పరోక్షంగా రాహుల్‌ను ప్రస్తావించారు. 

కాంగ్రెస్‌కు ప్రతి విషయంపైనా అవిశ్వాసమేనని సెటైర్ వేశారు. ప్రభుత్వమైనా, సర్జికల్ స్ట్రైక్స్ అయినా, చివరికి ఈవీఎంలపైనా వారికి అనుమానాలు అంటూ సీఎం ఖట్టర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ గనక అధికారంలో ఉంటే అంతా బాగుంటుందని, మిగితా వారు ఎవరైనా అధికారంలో ఉంటే వారికి అలా అనిపించదని ఖట్టర్ ధ్వజమెత్తారు. 

కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కూడా అవిశ్వాసం ఉందని పేర్కొంటూ పీసీచాకో ఈ కారణంగానే వైదొలిగారని తెలిపారు. కొన్ని సార్లు జీ 23 నేతలు అవిశ్వాసం వ్యక్తం చేస్తారని, మరోమారు సూర్జేవాలా అని, రాష్ట్రంలో హుడా అవిశ్వాసాన్ని లేవదీస్తారని ఖట్టర్ ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం సాగిస్తోందని హర్యానా ఉపముఖ్యమంత్రి దుష్యంత్‌ సింగ్‌ చౌతాలా ఆరోపించారు.

ఈ తీర్మానంలో ముఖ్యమంత్రిపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ నెగ్గుకరాలేకపోయింది. తగినంత మంది ఎమ్మెల్యేల బలం లేకపోవడంతో ప్రభుత్వంపై పెట్టిన విశ్వాసం వీగిపోయింది. 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీలో ప్రస్తుతం 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 

ఇందులో 45 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే కానీ విశ్వాస తీర్మానం నిలబడదు. అయితే 30 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తగినంత మంది ఎమ్మెల్యేలను కూడగట్టడంలో విఫలమైంది. ఇక జేజేపీకి చెందిన 10 మంది ఎమ్మెల్యే మద్దతుతో మొత్తం 50 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న బీజేపీ.. సునాయాసంగా గట్టెక్కింది.