ప్రేమకు వ్యతిరేకం కాదు… జిహాద్ కే వ్యతిరేకం!

వివాహం పేరుతో మోసపూరితంగా మతమార్పిడికి పాల్పడడంపై మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. దాన్ని నేరపూరితంగా పరిగణిస్తూ, అందుకు పదేళ్ళ వరకు జైలు శిక్షని విధించేలా మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో బిల్లుని పాస్‌ చేశారు. 
 
ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఈ చట్టం ఆవశ్యకతను ప్రశ్నించగా, హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్రా సమాధానమిస్తూ 1968 చట్టం మాదిరిగా కాకుండా, ఈ చట్టం అలాంటి వివాహాన్ని రద్దు చేస్తుందని, ఆ నేరానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష పడుతుందని చెప్పారు.

అలాగే లక్ష రూపాయల వరకు జరిమానా కూడా విధిస్తారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో సైతం ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చారు. మోసపూరితంగా గానీ, బలవంతంగా గానీ, భయపెట్టిగానీ, ఏదైనా ప్రలోభంతో గానీ పెళ్ళి పేరుతో మతమార్పిడికి పాల్పడడం ఈ చట్టరీత్యా నిషేధం. దాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు.

‘‘మధ్య ప్రదేశ్‌ ఫ్రీడం ఆఫ్‌ రిలీజియన్‌ బిల్‌ 2021’’ఆమోదం అనంతరం బీజేపీ శాసనసభ్యులు సభలో ‘జై శ్రీరాం’నినాదాలు చేశారు. అంతకు ముందు జరిగిన చర్చ సందర్భంగా హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్రా మాట్లాడుతూ తాము లవ్‌ జిహాదీ కోసం ‘రఫీక్‌ని రవిగా’మారనివ్వమని స్పష్టం చేశారు.

తాము ‘లవ్’ (ప్రేమ)కు  వ్యతిరేకులం కాదని, `జిహాద్‌’కి మాత్రమే వ్యతిరేకం అని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటులో సీఏఏని వ్యతిరేకించినట్టే, ఆర్టికల్‌ 370ని వ్యతిరేకించినట్టే కాంగ్రెస్‌ ఈ బిల్లుని సైతం వ్యతిరేకించిందని ఆయన ఎద్దేవా చేశారు. .