కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో నటుడు అర్జున్‌ భేటీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌ జి కిషన్‌రెడ్డితో ప్రముఖ తమిళ నటుడు అర్జున్‌ భేటీ కావడం రాజకీయ వర్గాలలో ఆసక్తి కలిగిస్తున్నది. దీంతో ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జోరందుకుంది.

చెన్నైలో మకాం వేసి ఎన్నికల వ్యూహాలకు కిషన్‌రెడ్డి పదును పెట్టిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ మురుగన్, కిషన్‌రెడ్డిలను అర్జున్‌ మంగళవారం కలవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.

కొంత సేపు వీరి మధ్య పలు అంశాలపై చర్చ సాగిన సమాచారంతో అర్జున్‌ బీజేపీలో చేరుతారన్న ప్రచారం జోరందుకుంది. అయితే ఈ పలకరింపు మర్యాద పూర్వకమేనని, కిషన్‌రెడ్డి తనకు సన్నిహితుడు కావడంతోనే ఆయన్ను కలిసినట్టుగా అర్జున్‌ పేర్కొన్నారు.

 ఇలా ఉండగా, సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం రాకపోవడంతో అన్నాడీఎంకే కూటమికి డీఎండీకే గుడ్‌బై చెప్పేసింది. గత కొన్నాళ్లుగా నెలకొన్న ప్రతిష్ఠంభనకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ కూటమి నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది.

అన్నాడీఎంకేలో పీఎంకేకు 23 నియోజకవర్గాలను కేటాయించడంతో తమ పార్టీకి 42 నియోజకవర్గాలను కేటాయించాలని తొలుత డీఎండీకే పట్టుబట్టింది. అయితే కూటమిలో మిత్రపక్షాల సంఖ్య అధికంగా ఉండటంతో అన్ని సీట్లను కేటాయించలేమని అన్నాడీఎంకే చెబుతూ వచ్చింది.

 ఆ తర్వాత పీఎంకేకు కేటాయించినట్టు తమ పార్టీకి కూడా 23 నియోజకవర్గాలు కేటాయించాలని పట్టుసడలించింది. అయినా 15 మించి కేటాయించడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో కూటమి నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు.