* రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డ డీఎంకే
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ మిత్రుడు రాహుల్ గాంధీపై ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తీవ్ర పదజాలంతో ద్విముఖ దాడిని ప్రారంభించింది. డీఎంకే ఐటీ విభాగం రాహుల్ గాంధీని ఒక పెద్ద జోక్‌గా ఎద్దేవా చేయగా, కాంగ్రెస్ నాయకుడు ప్రతిపక్ష ఐక్యతను బలహీనపరుస్తున్నారని పార్టీ అధికార పత్రిక మురసోలి ఆరోపించింది. తీవ్రమైన పదజాలంతో కూడిన ఒక సంపాదకీయంలో, రాహుల్ గాంధీ కూటమి రాజకీయాల వైఖరి అస్థిరంగా ఉందని అభివర్ణించింది.
ఆయన చర్యలు ‘ఇండియా’ కూటమిలో అంతర్గత విభేదాలకు దోహదపడ్డాయని వాదించింది. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఐక్యత ఒక ప్రధాన రాజకీయ ఇతివృత్తంగా ఉన్న తరుణంలో, ప్రతిపక్ష పార్టీల మధ్య సమైక్యతను కాపాడగల ఆయన సామర్థ్యాన్ని కూడా ఆ పత్రిక ప్రశ్నించింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ విడిపోవడంపై డీఎంకే ఐటీ విభాగం స్పందిస్తూ కాంగ్రెస్ తన రాజకీయ ఉనికి కోసం పోరాడుతున్నపుడు `మేము వారిని మా భుజాలపై మోశాము. కానీ ఒక కొత్త ఆకర్షణీయమైన అవకాశం కనిపించగానే వారు వెంటనే మాకు చెయ్యిచ్చి వెళ్లిపోయారు’ అని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. రాహుల్ గాంధీని ఒక పెద్ద జోక్ అంటూ అభివర్ణించింది.
కాగా, అదే సమయంలో డీఎంకే అధికారిక పత్రిక మురసోలి సోమవారం ప్రచురించిన తన సంపాదకీయంలో ఇండియ కూటమి సమావేశం తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. విపక్షాల మధ్య విభేదాలు తలెత్తడానికి రాహులే కారణమని ఆరోపించింది. విపక్షాల ఐక్యత గురించి బోధిస్తూనే మరోవైపు దానిని దెబ్బతీస్తున్నారని రాహుల్ గాంధీపై ధ్వజమెత్తింది.
కూటమి భాగస్వాముల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఐక్యత గురించి రాహుల్ గాంధీ ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ వివిధ రాష్ర్టాల్లో ఆ ఐక్యతను బలహీనపరిచింది ఎవరు? అని సంపాదకీయం నిలదీసింది. కేరళలోని వామపక్ష పార్టీలు రాహుల్ గాంధీపై చేసిన విమర్శలను కూడా సంపాదకీయం ప్రస్తావించింది. వివిధ రాష్ర్టాల్లో బీజేపీని సవాలు చేసే మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు అధికారంలోకి రాకుండా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ పదేపదే అడ్డుపడ్డాయని కూడా సంపాదకీయం ఆరోపించింది.
ప్రభుత్వాలను ఏర్పాటు చేసే తమ విజయావకాశాలను కాంగ్రెస్ దెబ్బతీసిందని మిత్రపక్షాలే ఆరోపించగా ఆ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షాల ఐక్యత గురించి ఎలా మాట్లాడగలదని పత్రిక ప్రశ్నించింది. వామపక్ష పార్టీలు, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు తదితరులు సహా ఇండియా కూటమిలోని పలు భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్‌ను విమర్శించాయని, రాహుల్ రాజకీయ విధానాలు ప్రతిపక్ష కూటమిలో పదేపదే ఘర్షణలకు దారితీశాయని మురసోలి విమర్శించింది.
తమిళనాడు రాజకీయాలతో పోలికలు చూపుతూ కూటమి తరఫున పోటీ చేసి సీట్లు గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ డీఎంకేకు ద్రోహం చేసిందని పేర్కొన్నది. తమిళనాడులో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును చూశాక కూటమి భాగస్వాములకు రాహుల్ గాంధీ ఇటీవల ఇచ్చిన హామీలను నమ్మవచ్చా? అని పత్రిక ప్రశ్నించింది. ప్రతిపక్ష పార్టీలు బీజేపీ బదులుగా కాంగ్రెస్‌పైనే ఎక్కువగా విమర్శలను గుప్పిస్తున్నాయని పత్రిక తెలిపింది. అలాగే ఇండియా కూటమిలో పెరుగుతున్న విభేదాలకు రాహుల్ గాంధీ రాజకీయ అపరిపక్వత, స్థిరత్వం లోపించడమే కారణమని మురసోలి ఆరోపించింది.

More Stories
ఉద్ధవ్ శివసేనను కుదిపేస్తున్న ‘ఆపరేషన్ టైగర్’
హిందూ ధర్మం కూడా నమోదు కాలేదు
‘టైమ్స్’ అత్యంత ప్రభావశీలుర జాబితాలో మంధాన!