`ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్టు’ వాజేను అరెస్ట్ చేయండి  

ముంబైలోని ముఖేశ్ అంబానీ ఇంటి ముందు బాంబుల‌తో వ‌దిలివెళ్లిన కారు ఘ‌ట‌న వ్య‌వ‌హారం ఇవాళ మ‌హారాష్ట్ర అసెంబ్లీలో తీవ్ర దుమారం లేపింది.  ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్టుగా పేరుగాంచిన ఏపీఐ స‌చిన్ వాజేను ఈ కేసులో అరెస్టు చేయాల‌ని మాజీ ముఖ్యమంత్రి  దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.
మ‌హారాష్ట్ర అసెంబ్లీలో ఆయ‌న మాట్లాడుతూ  ముఖేశ్ అంబానీ ఇంటి ముందు క‌నిపించిన కారు గ‌త నాలుగు నెల‌ల నుంచి ఇన్‌స్పెక్ట‌ర్ స‌చిన్ వాజే వ‌ద్దే ఉన్న‌ట్లు తెలిపారు.  కారు ఓన‌ర్ అయిన మ‌న్సూక్ హీర‌న్ ఆ త‌ర్వాత శ‌వ‌మై క‌నిపించాడు.  త‌న భ‌ర్త‌ను ఇన్‌స్పెక్ట‌ర్ స‌చిన్ చంపి ఉంటార‌ని మ‌న్సూక్ హిరెన్ భార్య ఆరోపిస్తున్న‌ట్లు ఫ‌డ్నవీస్ స‌భ‌లో వెల్ల‌డించారు.
 శివ‌సేన నేత ధ‌నంజ‌య్ గాద్వే ఆఫీసు వ‌ద్ద చివ‌రిసారి మ‌న్సూక్ హిరన్ ఫోన్ లొకేష‌న్ చూపించిన‌ట్లు అత‌ని భార్య చెప్పిందని అయన పేర్కొ‌న్నారు. ధ‌నంజ‌య్ గాద్వేతో పాటు ఇన్‌స్పెక్ట‌ర్ స‌చిన్ వాజేలు 2017లో చోటుచేసుకున్న బెదిరింపుల కేసులో ఉన్నార‌ని ఫ‌డ్న‌వీస్ ఆరోపించారు.
మాజీ సీఎం ఫ‌డ్న‌వీస్ చేసిన ఘాటు ఆరోప‌ణ‌ల‌తో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది.  `యే స‌ర్కార్ ఖూనీ హై’ అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.  దీంతో స‌భ‌ను వాయిదా వేశారు. ఖ్వాజా యూనిస్ క‌స్ట‌డీ డెత్ కేసులో 2007లోనే పోలీసు ఆఫీస‌ర్ స‌చిన్ వాజే బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్నారు.  ఘాట్‌కోప‌ర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితుడైన ఖ్వాజా క‌స్ట‌డీలో చ‌నిపోయాడు.
అయితే ఆ కేసులో ఆఫీస‌ర్ స‌చిన్‌పై విధించిన స‌స్పెన్ష‌న్‌ను గ‌త ఏడాది  ఎత్తివేశారు.  కోవిడ్ సంక్షోభం వేళ పోలీసుల సంఖ్య త‌క్కువ ఉన్నందుకు 2020 జూన్‌లో మ‌ళ్లీ స‌చిన్ వాజే విధుల్లో చేరిన‌ట్లు తెలుస్తోంది.