శృంగార వీడియో పచ్చి అబద్దం…. రాజకీయ కుట్ర 

మంత్రి పదవికి  రాజీనామా చేయడానికి కారణమైన శృంగార వీడియోలో ఉన్నది తాను కాదని,  అది పచ్చి అబద్దమని పేర్కొంటూ ఆ వీడియో  ఓ రాజకీయ కుట్రని కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జర్కిహోళి ఆరోపించారు. ‘‘ఆ వీడియో, సీడీ రెండూ పచ్చి అబద్ధం. నేను చాలా అమాయకుడిని. రాజకీయంగా నన్ను దెబ్బతీసేందుకు కుట్ర పన్ని ఇలా చేశారు’’ అని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.

 ‘‘ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో నాకు తెలియదు. అది నేను అన్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోంది. నాపై జరుగుతున్న తప్పుడు ప్రచారం గురించి పార్టీ హైకమాండ్‌కు సమాచారం అందించాను. వారిని తగిన సహాయం చేయాల్సిందిగా కోరాను. నాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కుట్రపై నేను పోరాటం కొనసాగిస్తాను’’ అని జర్కిహోళి స్పష్టం చేశారు.

రూ 20 కోట్లు ఖర్చు పెట్టి మరీ తనను దెబ్బతీసేందుకు రాజకీయ కుట్ర పన్నారని ఆయన ధ్వజమెత్తారు. ‘‘ఆ వీడియోను నేను 4 నెలల క్రితమే చూశాను. నా సోదరుడు బాలచంద్ర జర్కిహోళితో కూడా ఈ విషయంపై కొన్నిసార్లు చర్చించాను. నేను ఏ తప్పూ చేయలేదు” అని తెలిపారు.

“నాకందిన సమాచారం మేరకు.. ఆ వీడియోలో ఉన్న యువతి రూ 5 కోట్లు, విదేశాల్లో రెండు ప్లాట్లకు అమ్ముడుపోయింది. యశ్వంతపూర్‌లోని ఓరియన్‌ మాల్‌లో నాపై కుట్ర జరిగింది. ఇది నా ఇమేజ్‌ని, నా భవిష్యత్‌ని దెబ్బ కొట్టాలని జరిగిన కుట్ర’’ అని రమేష్ జర్కిహోళి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, తనపై వచ్చిన ఈ ఆరోపణల కారణంగా మార్చి 3న జలవనరుల శాఖ మంత్రిగా ఆయన రాజీనామా చేశారు. వీడియో విడుదలైన రోజు తాను మంత్రి పదవికి రాజీనామా చేయబోనని రమేష్ ప్రకటించినప్పటికీ.. రాజకీయంగా దుమారం రేగడంతో మరుసటి రోజే రాజీనామా చేశారు.