ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. కాసేపటి కిందటే గవర్నర్ రాణీ మౌర్యను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. ఉత్తరాఖండ్‌లో నాయకత్వ మార్పుపై ఉదయం నుంచీ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోమవారం రాత్రి ఆయన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలిశారు.
త్రివేంద్ర రావత్ పనితీరుపై అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. త్రివేంద్ర స్థానంలో ధన్‌సింగ్ రావత్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఇప్పుడు నాయకత్వ మార్పు చేయడం గమనార్హం.
రాజీనామా తర్వాత త్రివేంద్ర రావత్ మీడియాతో మాట్లాడుతూ తాను చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, బీజేపీ తనకు ఓ సువర్ణావకాశాన్ని ఇచ్చిందని చెప్పారు. ఈ అవకాశాన్ని మరొకరికి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి నాలుగేళ్ళపాటు సేవ చేసే సువర్ణావకాశాన్ని పార్టీ తనకు ఇచ్చిందని కృతజ్ఞతలు తెలిపారు.
ఈ అవకాశం తనకు లభిస్తుందని తాను ఎన్నడూ అనుకోలేదని పేర్కొన్నారు. ఈ పదవి ఎవరు తీసుకున్నా వాళ్లకు ఆల్ ద బెస్ట్ చెబుతున్నానని త్లెఇపారు. బుధవారం ఉదయం 10 గంటలకు బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ఉంటుందని ఆయన వెల్లడించారు.
త్రివేంద్ర సింగ్ రావత్ ముఖ్యమంత్రిగా అనుసరించిన వైఖరి పట్ల ఉత్తరాఖండ్ బీజేపీలో అసంతృప్తి ఉన్నట్లు బయటపడటంతో ఆ పార్టీ అధిష్ఠానం ఇటీవల ఇద్దరు పరిశీలకులను పంపించింది. బీజేపీ ఉపాధ్యక్షుడు రమణ్ సింగ్, జనరల్ సెక్రటరీ దుష్యంత్ కుమార్ గౌతమ్‌లను పరిశీలకులుగా పంపించి, ఉత్తరాఖండ్‌లోని బీజేపీ నేతల అభిప్రాయాలను సేకరించింది.
More Stories
తుది దశకు చేరుకున్న వామపక్ష తీవ్రవాదం
దుర్గామాతపై గర్భా గీతం రాసిన ప్రధాని మోదీ
గోమాత విజ్ఞాన పరీక్షా పోస్టర్ ఆవిష్కరించిన భగవత్