సీఎం చౌహాన్‌కు రక్షణగా మహిళలే!

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌కు అరుదైన గౌర‌వం ఇచ్చింది. ఆ రాష్ట్ర  ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌కు అర్హ‌త గ‌ల మ‌హిళ‌ల‌ను సెక్యూరిటీగా నియ‌మించింది. సీఎం ప్ర‌యాణించే కారు డ్రైవ‌ర్ కూడా మ‌హిళే కావ‌డం విశేషం.
 
 సీఎంకు ర‌క్ష‌ణ‌గా ఉన్న మ‌హిళ‌లంద‌రూ ఒకే యూనిఫాం ధ‌రించి.. ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. మ‌హిళా దినోత్స‌వం నేప‌థ్యంలో సీఎం శివ‌రాజ్‌సింగ్‌.. ఇవాళ ఉద‌యం పారిశుద్ధ్య కార్మికుల‌తో ముచ్చ‌టించారు. వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. సీఎం కూడా చీపురు ప‌ట్టి ఊడ్చి.. కార్మికుల‌కు అండ‌గా ఉంటామ‌ని భ‌రోసానిచ్చారు.
 
ఇలా ఉండగా, మహిళల సామాజిక ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి దేశంలో ఇంకా చాలా చేయాల్సి ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమని అభిప్రాయపడ్డారు. కుటుంబానికి, సమాజానికి, దేశానికి మహిళలే స్ఫూర్తి అని కొనియాడారు. 
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సాధించిన విజయాలతో దేశం గర్విస్తున్నదని అన్నారు. మహిళా సాధికారత సాధనకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడమే తమ లక్ష్యమని తెలిపారు. ‘మన దేశానికి చెందిన మహిళలు సాధించిన అనేక విజయాలతో భారత్‌ గర్విస్తున్నది. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తూ సాధికారత సాధించేలా మా ప్రభుత్వం కృషి చేస్తున్నది’ అని ట్వీట్‌ చేశారు.